Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్‌, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన

  • జమ్మూకాశ్మీర్‌, లడఖ్ గురించి మాట్లాడొద్దు
  • యూరోపియన్ యూనియన్‌కు భారత్ సూచన
  • పాక్‌లో ఈయూ విదేశీ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్ పర్యటన
Randhir Jaiswal

Randhir Jaiswal

జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలపై దౌత్యపరంగా శాంతి యుతంగా పరిష్కరించుకోవాలంటూ యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానాల ఉన్నత ప్రతినిధి కాజా కల్లాస్ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. పాక్-ఈయూ సంయుక్త ప్రకటనలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘భారత్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై ఇటువంటి అనవసర వ్యాఖ్యలను మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం. జమ్మూకాశ్మీర్, లడఖ్ భారత్‌లో అంతర్భాగాలు. ఈ విషయాల్లో ఎలాంటి హక్కు లేని వారు వ్యాఖ్యానించకుండా ఉండాలి.’’ అని హితవు పలికారు. జమ్మూకశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం అంగీకారయోగ్యం కావని… భారత్‌కు చెందిన అంతర్గత అంశం మాట్లాడొద్దని హితవు పలికారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో  కాజా కల్లాస్ పర్యటిస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో నదీ జలాల అంశాలపై..
ఇక భారత్-బంగ్లాదేశ్ మధ్య నదీ జలాల అంశాలపై కూడా స్పందించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉమ్మడిగా ఉన్నాయని తెలిపారు. ఈ నదులకు సంబంధించిన అంశాలను పరిష్కరించేందుకు ఉమ్మడి నదుల కమిషన్ (Joint Rivers Commission) అనే ద్వైపాక్షిక వ్యవస్థ పనిచేస్తోందని చెప్పారు. నదీ జలాల వినియోగం, నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ఈ ద్వైపాక్షిక వ్యవస్థ ద్వారానే చర్చించి పరిష్కరిస్తామని, భవిష్యత్తులో కూడా ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొన్నారు.

×
×
Ad

అమెరికా బహిష్కరణ
అమెరికా నుంచి 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను బహిష్కరించారన్న వార్తలపై స్పందించిన జైస్వాల్.. అక్రమ వలసలను భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. “అమెరికా నుంచి బహిష్కరణకు సంబంధించిన కేసులు వచ్చినప్పుడు మేము పూర్తిగా సహకరిస్తాం. ముందుగా వారి జాతీయతను ధృవీకరిస్తాం. వారు భారతీయులని నిర్ధారణ అయిన తర్వాత వారిని భారత్‌కు తిరిగి తీసుకుంటాం” అని తెలిపారు.

లెబనాన్‌పై ఆందోళన
లెబనాన్‌లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక చర్యలపై కూడా భారత్ స్పందించింది. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని తెలిపారు. “ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించాలంటే సంభాషణలు, దౌత్యపరమైన చర్చలే సరైన మార్గం. అన్ని పక్షాలు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ముందుకు సాగాలి” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారత్ ఎప్పటిలాగే శాంతియుత పరిష్కారానికే మద్దతు ఇస్తోందని.. పశ్చిమాసియాలో స్థిరత్వం నెలకొనాలని కోరుకుంటోందని స్పష్టం చేశారు.