India-Iran: హార్ముజ్‌లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్.. ఇరాన్‌ రాయబారికి సమన్లు

  • హార్ముజ్‌లో భారతీయుడి మృతిపై భారత్ సీరియస్
  • ఇరాన్‌ రాయబారికి సమన్లు జారీ చేసి నిరసన
  • వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆగాలని డిమాండ్
Iran

Iran

పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఖమేనీ అంత్యక్రియల వరకు స్తబ్దతగా ఉన్న ఇరాన్.. ఇప్పుడు దూకుడు పెంచింది. ప్రతీకార దాడులతో చెలరేగుతోంది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరాన్‌ను అమెరికా లక్ష్యంగా చేసుకోగా.. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలను ఇరాన్ టార్గెట్‌గా పెట్టుకుని దాడులు చేస్తోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిని కూడా కంట్రోల్‌లోకి తెచ్చేందుకు ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా దాడుల్లో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనపై భారత్ సీరియస్ అయింది. వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

ఎంఎటీ అల్ బహియాహ్ (MT Al Bahiyah), ఎంఎటీ మొంబాసా (MT Mombasa) అనే రెండు వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను విదేశాంగ శాఖకు పిలిపించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాల్లో భద్రతను కాపాడాల్సిన బాధ్యత అన్ని దేశాలదేనని, ఇలాంటి దాడులు అంతర్జాతీయ నౌకాయానానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారతాయని భారత్ స్పష్టం చేసింది.

9 మంది భారతీయుల మృతి

ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత హార్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇప్పటివరకు కనీసం తొమ్మిది మంది భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మార్చి 1న మార్షల్ దీవుల జెండాతో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై జరిగిన దాడిలో తొలి భారతీయ నావికుడు మరణించాడు. అనంతరం ఒమాన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న స్కైలైట్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో మరో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మే 8న మరో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా, ఒమాన్ తీరంలో ఎంటీ సెట్టెబెల్లో (MT Settebello) అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా జరిపిన దాడిలో మరో ముగ్గురు భారతీయులు మరణించారు.

విదేశాంగ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఎంటీ అల్ బహియాహ్, ఎంటీ మొంబాసా నౌకల్లో మొత్తం 46 మంది సిబ్బంది ఉండగా, వారిలో 30 మంది భారతీయులు ఉన్నారు. ఎంటీ అల్ బహియాహ్లో ఉన్న 12 మంది భారతీయుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. ఎంటీ మొంబాసాలో ఉన్న 18 మంది భారతీయుల్లో తొమ్మిది మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పశ్చిమాసియాలో మళ్లీ చెలరేగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వం కోసం వెంటనే కాల్పుల విరమణ జరగాలని, అన్ని పక్షాలు తిరిగి చర్చలు, దౌత్య మార్గాన్నే అనుసరించాలని విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛాయుత నౌకాయానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది.

మృతి చెందిన భారతీయ నావికుడి కుటుంబానికి విదేశాంగ శాఖ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ బాధిత భారతీయులకు అవసరమైన అన్ని సహాయ చర్యలు అందిస్తున్నట్లు వెల్లడించింది.