India-Pakistan: “పాకిస్తాన్‌తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..

  • పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడేది లేదని స్పష్టం చేసిన కేంద్రం..
  • అంతర్జాతీయ టోర్నీలకు మాత్రం అనుమతి..
Ind Vs Pak

Ind Vs Pak

India-Pakistan: పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. భారత జట్లు పాకిస్తాన్‌లో జరిగే ద్వైపాక్షిక టోర్నమెంట్‌లలో పాల్గొనదు. ఇదే విధంగా పాకిస్తాన్ జట్లు కూడా భారత్‌లో ఇలాంటి మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండదు.

అయితే, ఇది అంతర్జాతీయ, మల్టీ-నేషన్ ఈవెంట్లకు వర్తించదని చెప్పింది. దీని ప్రకారం, ఒక టోర్నమెంట్‌లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ దేశాలు భాగమైతే ఈ టోర్నీలో భారత్ పాల్గొనవచ్చు. అలాగే భారత్‌లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాకిస్తాన్ క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంటుంది.

Read Also: Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

ఆసియా కప్‌లో భారత్ పాల్గొనడంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో, ఈ విధానాన్ని తొలిసారిగా 2025 ఆగస్టులో తీసుకువచ్చారు. 26 మంది మరణాలకు కారణమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనే విషయంలో సంబంధిత ప్రపంచ క్రీడా సంస్థల మార్గదర్శకాలకు, తమ అథ్లేట్ల ప్రయోజనాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ పోటీలో ఉన్న సమయంలో ఈ మార్గదర్శకాలు వెలువడ్డాయి.

ఇదే సమయంలో భారతదేశాన్ని క్రీడలకు గమ్యస్థానంగా మార్చేందుకు అంతర్జాతీయ క్రీడా సంస్థల ఆటగాళ్లు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బంది, అధికారుల వీసా ప్రక్రియ సులభతరం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ క్రీడా సంస్థల అధికారులకు 5 ఏళ్ల వరకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.