NTV Telugu Site icon

India: షింజో అబే హత్యకు భారత్‌ సంతాపం.. జాతీయ జెండా అవనతం

National Flag Half Mast

National Flag Half Mast

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ఇవాళ సంతాపం తెలపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జ‌పాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతికి నివాళిగా శ‌నివారం దేశవ్యాప్తంగా జాతీయ ప‌తాకాన్ని అవ‌న‌తం చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట‌, రాష్ట్రప‌తి భ‌వ‌న్‌, పార్లమెంట్ భ‌వ‌నాల‌పై జాతీయ జెండాల‌ను సగం వ‌ర‌కు కింద‌కు దించారు. అబే మృతికి నివాళిగా భార‌త్‌లో శ‌నివారం రోజు సంతాపం దినం పాటించ‌నున్నట్లు శుక్రవారం ట్విటర్‌ వేదికగా మోదీ ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే.

అబే మృతి ప‌ట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ సంతాపం తెలిపారు. జపాన్‌ కోసం అబే తన జీవితాన్నే అంకితం చేశారని కొనియాడారు. 2021లో కేంద్ర ప్రభుత్వం అబెకు భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. భారత్‌లో ముంబై-అహ్మదాబాద్‌ మధ్య తొలి బుల్లెట్‌ రైలు రావటంలో షింజో అబే కీలక పాత్ర పోషించారు. జపాన్‌ సాంకేతికతతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్‌లో ప్రధాని మోదీ, అబె కలిసే శంకుస్థాపన చేశారు. ‘మై ఫ్రెండ్, అబే సాన్’ అనే శీర్షికతో ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రధాని మోడీ ఇలా రాశారు. “అబే మరణంతో, జపాన్, ప్రపంచం ఒక గొప్ప దూరదృష్టిని కోల్పోయింది. నేను ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను” అని రాసుకొచ్చారు.

Tamarind seeds: కాసులు కురిపిస్తున్న చింతగింజలు..అక్కడ భలే ఉపాధి

శుక్రవారం పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో ప్రచార ప్రసంగం చేస్తున్న సమయంలో అబేపై కాల్పులు జరిగాయి. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. “కార్డియోపల్మోనరీ అరెస్ట్” పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అబే ప్రాణాలు విడిచినట్లు సాయంత్రం 5:03 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) వైద్యులు అధికారికంగా వెల్లడించారు. స్థానిక మీడియా ప్రకారం, నారా సిటీకి చెందిన 41 ఏళ్ల టెట్సుయా యమగామి అనే అనుమానితుడిని జపాన్ పోలీసులు అరెస్టు చేశారు. జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2020లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అతను 2006-07, 2012-20 వరకు రెండుసార్లు జపాన్ ప్రధానిగా ఉన్నారు. అతని తరువాత యోషిహిడే సుగా, ఫ్యూమియో కిషిడా అధికారంలోకి వచ్చారు.