Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!

  • దేశంలో 10,000 కి.మీ పొడవైన వర్ష మేఘాల బెల్ట్
  • భారత్ నుంచి దక్షిణ కొరియా వరకు విస్తరించిన మాన్సూన్
  • భారీ వర్షాలు కురిసే అవకాశం
Monsoon

Monsoon

గత జూన్‌ నెలలో దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం జూలై నెలలో అందుకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలే కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా వాతావరణ శాఖ మరో శుభవార్త చెప్పింది. ఉపగ్రహ చిత్రాల్లో ఉత్తర భారతదేశం నుంచి హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు విస్తరించిన సుమారు 7,000 నుంచి 10,000 కిలోమీటర్ల పొడవైన భారీ వర్ష మేఘాల బెల్ట్ కనిపించింది. ఈ అరుదైన వాతావరణ పరిస్థితిని వాతావరణ శాస్త్రవేత్తలు ‘‘మాన్సూన్ కన్వర్జెన్స్ జోన్’’గా పేర్కొంటున్నారు. భారత మహాసముద్రం నుంచి వచ్చే తేమతో నిండిన గాలులు ఆసియా ఖండంలోని పలు వాతావరణ వ్యవస్థలతో కలవడం వల్ల వేల కిలోమీటర్ల మేర మేఘాలు, వర్షపాతం కొనసాగుతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ ప్రభావంతో భారత్‌లో గత రెండు రోజులుగా ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షాలు నమోదయ్యాయి.

సగటు కంటే 170-180 శాతం అధిక వర్షపాతం

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా సాధారణ రోజువారీ మాన్సూన్ వర్షపాతం కంటే 170 నుంచి 180 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో ఇది ఈ సీజన్‌లోనే అత్యంత భారీ వర్షాల దశగా నిలిచింది. ఉపగ్రహ చిత్రాల్లో మధ్య, ఉత్తర, తూర్పు భారతదేశం మొత్తం దట్టమైన మేఘాలతో కప్పబడి ఉండగా.. ఆ మేఘాలు హిమాలయాలు, చైనా, జపాన్ వరకు విస్తరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఎలా ఏర్పడింది?

మాన్సూన్ ట్రఫ్ చురుకుగా కొనసాగుతున్న సమయంలో వాతావరణంలో తేమతో కూడిన గాలులు ఒకే ప్రాంతంలో కలిసిపోవడం వల్ల ఈ భారీ మేఘాల బెల్ట్ ఏర్పడింది. పైకి లేచిన తేమగాలులు చల్లబడి భారీ వర్ష మేఘాలుగా మారడంతో ఆసియాలోని అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని వారాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తర, మధ్య భారతదేశాల్లో సీజనల్ వర్షపాతం లోటు గణనీయంగా తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతం నుంచి ఏర్పడిన అల్పపీడనాల ప్రభావంతో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కుండపోత కొనసాగుతోంది.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహా వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో ఆకస్మిక వరదలు, పట్టణాల్లో నీటిమునక, కొండచరియలు విరిగిపడటం, నదుల్లో వరద ప్రవాహం పెరగడం వంటి ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రమాద సూచనలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

ఈ అరుదైన మేఘాల బెల్ట్ ఆసియా ఖండంలోని వాతావరణ వ్యవస్థలు ఎంతగా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో మరోసారి నిరూపించిందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌లోని నైరుతి రుతుపవనాలు కేవలం దేశానికే పరిమితం కాకుండా అరేబియా సముద్రం నుంచి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించిన భారీ వాతావరణ చక్రంలో భాగమని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే వారం రోజుల పాటు కూడా మాన్సూన్ చురుకుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో దేశంలో వర్షాభావం మరింత తగ్గడంతో పాటు జలాశయాలు నిండిపోవడం, ఖరీఫ్ పంటలకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.