NTV Telugu Site icon

Cancer Cases: భారతదేశంలో 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు ?

Aiims Report On Cancer

Aiims Report On Cancer

Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్‌విఎస్ డియో అన్నారు. ప్రతీ ఏడాది 13-14 లక్షల మంది ప్రాణాంతక వ్యాధి బారిన పడే అవకాశం ఉందని.. 2026 నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు చేరుకోవచ్చని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం థీమ్ ‘ క్లోజింగ్ ద గ్యాప్’ అని ఆయన వెల్లడించారు. క్యాన్సర్ కు సంబంధించి అపోహలపై అవగాహన లేకపోవడం, వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని థీమ్‌ను ఎంచుకున్నట్లు ఆయన వివరించారు. క్యాన్సర్ పూర్తిగా నయం కాదనే ప్రజల అపోహా సరికాదని పేర్కొన్నారు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆయన వెల్లడించారు.

Read Also: Anand Mahindra: ఇండియాకు వ్యతిరేకంగా పందెం కాయొద్దు.. గ్లోబల్ మీడియాకు వార్నింగ్..

ఆరోగ్యమైన జీవన శైలి, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడంతో క్యాన్సర్ ను పారద్రోలవచ్చని అన్నారు. ప్రాసెస్డ్, ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయని వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. మొత్తం క్యాన్సర్ కేసుల్లో 30 శాతం స్మోకింగ్, ఆల్కాహాల్ డ్రికింగ్ అలవాట్లు ఉన్నవారికే వస్తున్నాయని అన్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళల్లో పిత్తాశయ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్య జీవనశైలి మరియు అపరిశుభ్రమైన నీరు మరియు ఆహారం తీసుకోవడం వల్ల కడుపు, పిత్తాశయం, మెడ, తలకు సంబంధించిన క్యాన్సర్లు ఈశాన్య ప్రాంతా ప్రజల్లో ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్లు వెల్లడించారు.

దేశంలో 16 ఏళ్లలోపు పిల్లల్లో జన్యుపరమైన క్యాన్సర్ కేసులు పెరిగాయని.. వాయుకాలుష్యం, నీటి కాలుష్యం, అనారోగ్యకరమైన జీవన శైలి కారంగా క్యాన్సర్లు వస్తున్నట్లు నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ సుష్మా భట్నాగర్ తెలిపారు. వాయుకాలుష్యం గర్భాశయ క్యాన్సర్లకు దారి తీస్తోందని అన్నారు. ఇంతకుముందు 50 ఏళ్లు పైబడిన వారికి క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉండేవని.. ప్రస్తుతం యువతరంలో కూడా ఈ ప్రాణాంతక వ్యాధి సోకుతోందని అన్నారు. క్యాన్సర్ చికిత్స మరింత అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.

Show comments