Site icon NTV Telugu

LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

Lpg

Lpg

LPG Crisis: ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి బ్లాక్ చేయడం భారత్‌కు అనేక పాఠాలు నేర్పింది. 140 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశానికి ఇంధన భద్రత అనేది చాలా కీలకం. ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవసరాలు చమురు, గ్యాస్‌పై ఆధారపడి ఉంటాయి. ఇరాన్ యుద్ధం వల్ల భారత్‌లో ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. ముఖ్యంగా, ఎల్పీజీ గ్యాస్ గురించి ప్రజలు చాలా ఆందోళన చెందారు. అయితే, మోడీ ప్రభుత్వం ప్రజలకు గ్యాస్ కొరత రాకుండా చూసుకుంది.

యుద్ధం నేర్పిన పాఠం:

ఇరాన్ యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. అయితే, ఇరాన్ యుద్ధం తీవ్రం కావడంతో భారత్ ఇతర దేశాల నుంచి కూడా గ్యాస్ దిగుమతుల్ని పెంచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఇప్పుడు స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని వల్ల దేశ ప్రజలకు ఎలాంటి సరఫరా కొరత లేకుండా చూసుకునే వీలు కలుగుతుంది. దీంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎల్పీజీ ట్యాంకర్లు భారత్‌కు వస్తూనే ఉంటాయి. దేశ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పాట్ మార్కెట్ నుంచి ఎల్పీజీ కార్గోలు జూన్, జూలై నెలల్లో భారత్ చేరుకుంటాయి.

15 దేశాల నుంచి ఎల్పీజీ:

అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతి చేసుకునేది. అయితే, ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఉత్పత్తిలో పెరుగుదల కారణంగా దేశ ప్రజలు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. భారత్‌కు ప్రతీ రోజూ సుమారుగా 80,000 టన్నుల ఎల్పీజీ అవసరం. ఇదిలా ఉంటే, దేశంలో ఉత్పత్తి దాదాపుగా 20 శాతం పెరగడం ద్వారా 46,000 టన్నులకు చేరింది.

ఇదే కాకుండా భారత్ ఇప్పుడు ప్రపంచంలోని 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి చేసుకుంటోంది. గతంలో ఈ దేశాల సంఖ్య 10గా ఉండేది. యుద్ధానికి ముందు గల్ఫ్ నుంచే 90 శాతం గ్యాస్ వచ్చేది. వీటిలో ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఒమన్ దేశాలు ఉన్నాయి. ఎల్పీజీ సంక్షోభం తర్వాత నుంచి మోడీ సర్కార్ అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా వంటి దేశాల నుంచి కూడా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది.

Exit mobile version