Oil Discovery: ముడి చమురు దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఆయిల్ దిగుమతుల్లో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం 85 శాతం ఆయిల్‌ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు చూస్తే భారత్ జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పూరీ మాట్లాడుతూ.. అండమాన్ సముద్రంలో భారత్ అతిపెద్ద చమురు నిల్వలను కనుగొనే దశలో ఉందని వెల్లడించారు. గయానాలోని చమురు నిల్వలకు సమానంగా ఈ నిల్వలు ఉన్నట్లు చెప్పారు. గయానాలో హెచ్ కార్పొరేషన్, CNOOC భారీ స్థాయిలో చమురు నిక్షేపాలను కనుగొంది. చమురు నిల్వల ప్రకారంగా గయానా ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది. 11.6 బిలియన్ బ్యారెళ్ల చమురు, గ్యాస్ ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం భారతదేశం రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది.
Read Also: Pune Bridge Collapses: పూణేలో ఘోర ప్రమాదం.. వంతెన కూలి ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు..
గయానా తో పోల్చదగిన చమురు నిల్వలు అండమాన్ సముద్రంలో కనుగొంటే భారత్ తలరాత మారిపోతుంది. మనం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గడంతో పాటు, విదేశీ మారక నిల్వలు పెరగడం, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకెళ్తుంది. భారతదేశంలో అస్సాం, గుజరాత్, రాజస్థాన్, ముంబై హై, కృష్ణ-గోదావరి బేసిన్ ముడి చమురు దొరికే కొన్ని ప్రదేశాలు. విశాఖపట్నం, మంగళూర్, పాదూర్ ప్రాంతాల్లో కూడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి.
అండమాన్ నికోబార్ దీవులలో చమురు, గ్యాస్ కోసం భారత్ అన్వేషిస్తోంది. ఆయిల్ ఇండియా, ఓఎన్‌జీసీ కంపెనీలు ఆ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపడుతున్నాయి. “అండమాన్ సముద్రంలో గయానా లాంటి ప్రధాన రిజర్వ్‌ను కనుగొనడంలో కొంత సమయం దూరంలో మాత్రమే ఉన్నామని నేను నమ్ముతున్నాను. మా అన్వేషణ కొనసాగుతోంది” అని కేంద్రమంత్రి చెప్పారు. గయానాలోని చమురు నిల్వలతో పోల్చదగిన చమురు నిల్వలను అండమాన్ ప్రాంతంలో భారతదేశం కనుగొనగలిగితే, దేశం $3.7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నుండి $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందగలదని ఆయన అన్నారు.
