Chabahar Port: భారత్‌కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. అయితే, ఇప్పుడు అమెరికా విధించిన ఆంక్షల నుంచి భారతదేశానికి 6 నెలల మినహాయింపు ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మినహాయింపులు సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
Read Also: Bandi Sanjay Kumar: బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గం..
సెప్టెంబర్ 18న, ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌లోని ఈ పోర్టు కార్యకలాపాలపై 2018లో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోర్టు నిర్మాణంలో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. ఇది భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించింది. ఇరాన్‌పై ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
తాజాగా అమెరికా ఇచ్చిన ఆంక్షల మినహాయింపు భారత్, చాబహార్ పోర్టులో యూఎస్ జరిమానాలు ఎదుర్కోకుండా పని కొనసాగించడానికి అనుమతిస్తుంది. పాకిస్తాన్‌ను బైపాస్ చేసి మధ్య ఆసియాతో వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు చాబహార్ పోర్టు భారత్‌కు చాలా ముఖ్యం. దీంతో పాటు పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టుకు చెక్ పెట్టేందుకు చాబహార్ పోర్టు భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యత అందిస్తుంది.
భారత్‌కు చాబహార్ చాలా కీలకం:
2018లో చాబహార్ పోర్టును భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ నుంచి కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లేందుకు, అక్కడి నుంచి సెంట్రల్ ఆసియా చేరేందుకు ఈ పోర్టు కీలకం. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తోంది. దీనికి కౌంటర్‌గా చాబహార్ ఉపయోగపడుతుంది. అయితే, 2021లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో చాబహార్ ప్రాముఖ్యత తగ్గింది. అయితే, ఇప్పుడున్న జియోపాలిటిక్స్‌లో భారత్-ఆఫ్ఘనిస్తాన్ బంధం మరింత బలపడింది. పాకిస్తాన్-ఆఫ్ఘాన్ లకు అసలు పడటం లేదు. దీంతో చాబహార్ పోర్టు మరోసారి తన ప్రాధాన్యతలోకి వచ్చింది.
చాబహార్ పోర్టు ఇరాన్ దక్షిణ తీరంలోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉంది. భారతదేశం ఈ ఓడరేవులో షాహిద్ బెహెష్టి టెర్మినల్‌ను నిర్వహిస్తోంది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కూడా చాబహార్ పోర్టును ఎంతో విలువైనదిగా భావిస్తుంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్‌ను దాటవేసి అరేబియా సముద్రం ద్వారా భారత్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ను కలుపుతుంది.
