Submarine Deal: భారత్ ‘ఓకే’ అంటే సముద్రంలో శత్రువుల పని ఖతమే .. రూ. 90 వేల కోట్ల మెగా డీల్‌కు జర్మనీ సై..

Submarine Deal

Submarine Deal

Submarine Deal: హిందూ మహాసముద్రంలో చైనా దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా భారత నౌకాదళం రెడీ చేసుకున్న మెగా ప్లాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో భారీ ముందడుగు పడింది. దాదాపు రూ. 70,000 కోట్ల నుంచి రూ. 90,000 కోట్ల విలువైన అత్యాధునిక జలాంతర్గాముల (సబ్‌మెరైన్లు) ఒప్పందానికి జర్మనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఒప్పంద పత్రాలతో సహా అన్ని రకాల డాక్యుమెంట్లకు జర్మనీ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇక ఇప్పుడు బంతి పూర్తిగా భారత్ కోర్టులోనే ఉందని, భారత రక్షణ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) గ్రీన్ సిగ్నల్ కోసం తాము ఎదురు చూస్తున్నామని జర్మనీ రాయబారిగా నియమితులైన డాక్టర్ జాస్పర్ వీక్ సంచలన ప్రకటన చేశారు.

శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఏఐపీ టెక్నాలజీ

భారత నేవీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘ప్రాజెక్ట్ 75(I)’ కింద ఆరు అత్యంత శక్తిమంతమైన సంప్రదాయ జలాంతర్గాములను నిర్మించనున్నారు. ఈ జలాంతర్గాముల్లో అమర్చే ‘ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్’ (AIP) సాంకేతికతే అసలైన గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని అంటున్నారు. సాధారణ సబ్‌మెరైన్లు బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవడానికి తరచూ నీటి పైకి రావాల్సి ఉంటుంది. దీంతో శత్రు దేశాల రాడార్లకు చిక్కే ప్రమాదం ఉంటుంది. అయితే ఏఐపీ టెక్నాలజీ ఉన్న జలాంతర్గాములు నీటి పైకి రాకుండానే, శత్రువులకు కనీస సమాచారం కూడా చిక్కకుండా వారాల తరబడి సముద్ర గర్భంలోనే దాగి ఉండి ఆపరేషన్లు నిర్వహించగలవని చెబుతున్నారు. ఇది నేవీ దాడి సామర్థ్యాన్ని, గూఢచర్య నిఘాను ఊహించని స్థాయికి తీసుకెళ్తుందని అంటున్నారు.

మేక్ ఇన్ ఇండియా.. స్వదేశీ గడ్డపైనే నిర్మాణం
ఈ భారీ ప్రాజెక్టును భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజాగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL), జర్మనీకి చెందిన ప్రసిద్ధ షిప్‌బిల్డర్ ‘థిస్సెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్’ (TKMS) సంయుక్తంగా చేపట్టనున్నాయి. ఇరు సంస్థల మధ్య 2023 జూన్‌లోనే ప్రాథమిక ఒప్పందం కుదిరింది. 2025 సెప్టెంబర్ నుంచి అధికారిక చర్చలు జరుగుతున్నాయి. జర్మనీ నుంచి భారత్‌కు అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్) బదిలీ కానుండటంతో, మన దేశంలోనే ఈ ఆరు జలాంతర్గాముల నిర్మాణం పూర్తవుతుంది. ఈ సబ్‌మెరైన్ల ప్రాజెక్టు కేవలం నేవీ బలాన్ని పెంచడానికే పరిమితం కాదని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తుందని జర్మనీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో డ్రోన్లు, మానవరహిత యుద్ధ వ్యవస్థలు, అధునాతన నిఘా సెన్సార్ల తయారీలోనూ ఇరు దేశాలు కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఇది రక్షణ బడ్జెట్‌లో చాలా పెద్ద మొత్తం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఢిల్లీ నుంచి అధికారిక ఆమోద ముద్ర పడటమే ఆలస్యం.. భారత నౌకాదళం సముద్ర గర్భంలో తిరుగులేని రక్షణ కవచంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.