India expels Canadian diplomat: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ఇండియా ప్రమేయం ఉందని చెబుతూ అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇందుకు ప్రతిగా భారత్ కూడా కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దెబ్బకు దెబ్బ తీసింది. యాంటీ-ఇండియా కార్యక్రమాలకు కెనడా నేలను ఉపయోగిస్తున్నారనే కారణంగా భారత్, కెనడియన్ డిప్లామాట్ ని బహిష్కరించింది.
కెనడా సీనియర్ దౌత్యవేత్త బహిష్కరణ గురించి తెలియజేసేందుకు భారతదేశంలో కెనడా రాయబారి కామెరూన్ మెక్‌కేని విదేశాంగ శాఖ పలిపించింది. సంబంధిత దౌత్యవేత్త 5 రోజుల్లో భారత్ విడిచివెళ్లిపోవాలని కోరింది. ‘‘మా అంతర్గత విషయాల్లో కెనడియన్ దౌత్యవేత్తల జోక్యం, భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలలో వారి ప్రమేయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని ఓ ప్రకటనలో భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
Read Also: India vs Canada: మన ప్రయోజనాలే ముఖ్యం.. మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు..
అంతకుముందు కెనడా పార్లమెంట్ లో మాట్లాడుతూ.. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆ దేశ విదేశాంగ శాఖ భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కెనడా ప్రభుత్వ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇవి అసంబద్దమై, ప్రేరేపితమైన ఆరోపణలుగా ఖండించింది. కెనడాలోని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) హెడ్ పవన్ కుమార్ రాయ్ ని బహిష్కరిస్తున్నట్లు అక్కడి సీబీసీ మీడియా తెలిపింది. ఈ నిర్ణయంపై భారత పార్లమెంట్ లో కేంద్రమంత్రి జైశంకర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్, భారతదేశంలో కుట్రలకు పాల్పడుతున్నాడు. పంజాబ్ వేరు చేసి సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో బాంబు దాడులు, ఉగ్రవాద వ్యాప్తికి కారణమవుతున్నాడు. జూన్ నెలలో ఆయన్ను కెనడా సర్రే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.