INDIA bloc: ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అరెస్టును కాంగ్రెస్, టీఎంసీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని బీజేపీ ఖూనీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీల వంటి కేంద్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపిస్తున్నారు.
Read Also: Moscow Attack: ఉగ్రదాడిపై పుతిన్ మాస్ వార్నింగ్.. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..!
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ.. మార్చి 31న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండియా కూటమి భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మార్చి 21న ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయగా.. రోస్ ఎవెన్యూ కోర్టు అతనికి మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఇండియా కూటమి మిత్రపక్షాలైన ఆప్, కాంగ్రెస్ ఈ విషయాన్ని ప్రకటించాయి. ‘‘ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో ఉంది. దేశ ప్రయోజనాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు మహార్యాలీని నిర్వహిస్తాము’’ అని ఆప్ నేత గోపాల్ రాయ్ అన్నారు.
దేశంలో నియంతృత్వాన్ని అనుసరించి ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, గౌరవించే ప్రతి వ్యక్తిలోనూ కోపం ఉందని, ప్రతీ ప్రతిపక్ష నాయకుడిపై నకిలీ కేసులు పెట్టడానికి ప్రధాని మోడీ ఒక్కొక్కటిగా ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆప్ నేత మండిపడ్డారు. మార్చి 3న నిర్వహించే మెగా ర్యాలీ రాజకీయం కాదు, దేశప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, కేంద్రానికి వ్యతిరేకంగా గొంతు వినిపించడానికి అని ఢిల్లీ ఆప్ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ అన్నారు.