Site icon NTV Telugu

INDIA Bloc: ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తుషార్! బ్యాగ్రౌండ్ ఇదే!

Indiabloc2

Indiabloc2

దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ఇక నామినేషన్‌కు రెండు రోజులే గడువు ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి తమిళనాడు వ్యక్తి, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఇందుకోసం ప్రతిపక్ష కూటమి తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఎన్డీఏ కూటమి దక్షిణాది వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. ఇప్పుడు విపక్ష కూటమి కూడా అదే బాటలో వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Giorgia Meloni: మోడీ స్టైల్‌లో ఇటలీ ప్రధాని.. అమెరికాలో ఏం చేశారంటే..!

ఈ సాయంత్రం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం కానుంది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఈ రేసులో ప్రధానంగా రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహిత, మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే తమిళనాడుకు చెందిన మాజీ ఇస్రో శాస్త్రవేత్త ఎం.అన్నాదురై పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరొకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తినే ఎంపిక చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Modi-Putin: మోడీకి పుతిన్ ఫోన్ కాల్.. అలాస్కా వివరాలు వెల్లడి

తుషార్ గాంధీ పేరును ఎన్‌సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రతిపాదించారని తెలిసింది. ఇక తమిళనాడు వ్యక్తికే ఇవ్వాలని డీఎంకే డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా శాస్త్రవేత్త అన్నాదురైని నామినేట్ చేయాలని డీఎంకే కోరినట్లుగా సమాచారం.

అయితే తుది నిర్ణయాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖర్జున ఖర్గేకు వదిలేసినట్లు తెలుస్తోంది. రాజకీయాలతో సంబంధాలు లేని వ్యక్తికి మద్దతు ఇచ్చేందుకు తృణమూల్ కాంగ్రెస్ కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. గతంలో జగదీప్ ధన్‌ఖర్‌పై పోటీ చేసిన ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఎంసీ మద్దతు ఇవ్వలేదు. ముందుగా తమను సంప్రదించలేదని మమత చెప్పారు. అయితే ప్రస్తుత పేర్లు తమకు అనుకూలంగా ఉన్నట్లు టీఎంసీ పేర్కొంది. వాస్తవానికి ఈసారి కూడా డీఎంకే నేత తిరుచ్చి శివ పేరు తెరపైకి వచ్చింది. టీఎంసీ అభ్యంతరంతో పక్కన పెట్టినట్లు సమాచారం.

వాస్తవానికి సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఎన్డీఏ కూటమినే ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకుంటుంది. అయినా కూడా తమ ఐక్యతను చాటిచెప్పాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని నిలబెడుతోంది. ప్రస్తుతం మొత్తం ఉభయ సభల సభ్యుల సంఖ్య 782గా ఉంది. సింపుల్ మెజారిటీ‌తో 392 ఓట్లు వచ్చిన అభ్యర్థే గెలుపొందుతారు. ఉభయ సభల్లో ఎన్డీఏ కూటమి బలం 422గా ఉంది. లోక్‌సభలో 293 ఎన్డీఏ కూటమి పక్షాల సభ్యులు, రాజ్యసభలో 129 మంది ఉన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. అయితే ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రాజ్‌నాథ్‌సింగ్ ఇండియా కూటమిని సంప్రదించగా.. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయమని తేల్చి చెప్పినట్లు సమాచారం.

Exit mobile version