Site icon NTV Telugu

PM Modi: కమీషన్ కోసం ఇండియా కూటమి.. మిషన్ కోసం ఏన్డీయే..

Pm Modi

Pm Modi

PM Modi: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సహరాన్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమిపై ప్రధాని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే మిషన్(లక్ష్యం) కోసం పనిచేస్తుంటే, ఇండియా కూటమి కమీషన్ సంపాదించడానికి ప్రయత్నిస్తోందని పీఎం మోడీ ఆరోపించారు. బీజేపీకి 370 కంటే ఎక్కువ సీట్లు రాకుండా ప్రయత్నించేందుకు ప్రతిపక్ష కూటమి పోరాడుతోందని ఆయన అన్నారు.

‘‘తన పాలనలో కాంగ్రెస్ కమీషన్లు సంపాదించడంపై దృష్టి పెట్టింది. ఇండి కూటమి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కమీషన్ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఎన్డీయే, మోడీ సర్కార్ ఒక మిషన్ కోసం పనిచేస్తున్నాయి.’’ అని ప్రధాని మోడీ అన్నారు. సమాజ్‌వాదీ(ఎస్పీ) ప్రతీ గంటకు అభ్యర్థిని మారుస్తోందని, కాంగ్రెస్‌కి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ప్రధాని అన్నారు. చివరకు తమ కంచుకోటల్లా భావించే స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కాంగ్రెస్ ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు.

Read Also: Maldives: భారత్‌కి మాల్దీవుల కృతజ్ఞతలు.. EAM జైశంకర్ స్పందన ఇదే…

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉందని, అందులో కొంత భాగం వామపక్షాల ఆధిపత్యం కనిపిస్తోందని ప్రధాని విమర్శించారు. ఇండియా కూటమి అస్థిరత, అనిశ్చితికి పర్యాయపదంగా మారిందని, దేశ ప్రజలు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదని ప్రధాని అన్నారు. ‘‘శక్తిని ఆరాధించడం మన సహజ ఆద్యాత్మిక ప్రయాణంలో భాగం, కానీ ఇండియా కూటమి ప్రజలు శక్తికి వ్యతిరేకంగా తమ పోరాటం అంటున్నారు’’ అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో 7 విడదల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సహారన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా (SC), మొరాదాబాద్, రాంపూర్ మరియు పిలిభిత్ ఎంపీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి.

Exit mobile version