NTV Telugu Site icon

India’s fuel exports: యూరప్‌కి అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా అవతరించిన భారత్..

India

India

India becomes Europe’s largest supplier of refined fuels: యూరప్ దేశాలకు అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా భారత్ నిలిచింది. భారత్ నుంచి గణనీయంగా శుద్ధి చేసిన ఇంధనం యూరప్ కు ఎగుమతి అవుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయికి ఇంధన ఎగుమతులు చేరాయి. అనలిటిక్స్ సంస్థ Kpler వెల్లడించిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి యూరప్ కు ఇంధన ఎగుమతులు పెరిగాయి. రోజుకు 3,60,000 బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురును భారత్ నుంచి యూరప్ దిగుమతి చేసుకుంటోంది. సౌదీ అరేబియా ఎగుమతుల కన్నా భారత్ ఎగుమతులు ఎక్కువగా ఉన్నట్లు సదరు సంస్థ పేర్కొంది.

Read Also: Adah Sharma: సంచలనం సృష్టిస్తున్న ‘కేరళ’ అమ్మాయిల మిస్సింగ్ ‘స్టొరీ’…

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరప్ లోని చాలా దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేశాయి. రష్యా నుంచి చౌకగా వస్తున్న చమురుపై యూరప్ దేశాలు ఆంక్షలు విధించడం భారత్ కు వరంగా మారింది. ఇదిలా ఉంటే రష్యా నుంచి డిస్కౌంట్ పై భారత్ క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేస్తోంది. గతంతో పోలిస్తే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ ఇంధనాన్ని భారత్ తన వద్ద ఉన్న రిఫైనరీల్లో శుద్ధి చేసి యూరప్ కు ఎగుమతి చేస్తుంది.

రష్యా నుంచి భారత్ కు రోజుకు సగటున 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతోంది. మన దేశం దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ లో ఇది 44 శాతం అని Kpler తెలిపింది. 2022-23లో భారత్ కు అతిపెద్ద క్రూడ్ ఆయిల్ సప్లయర్ గా రష్యా నిలిచింది. గతంలో పాశ్చాత్య దేశాల నుంచి రష్యా ఆయిల్ కొనద్దని భారత్ పై ఒత్తిడి పెట్టినప్పటికీ, ఇంధన భద్రత దృష్ట్యా భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకే మొగ్గు చూపింది. పాశ్చాత్య దేశాలు రష్యా ఆయిల్ పై బ్యారెల్ కు 60 డాలర్ల ధర పరిమితిని విధించాయి. దీని కన్నా తక్కువ ధరకు రష్యా, భారత్ కు ఇంధనాన్ని ఎగుమతి చేస్తోంది. ఫిబ్రవరి నెలలో 3.35 బిలియన్ డాలర్ల విలువై రష్యా ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంది. రష్యా తర్వాతి స్థానాల్లో 2.30 బిలియన్ డాలర్లతో సౌదీ అరేబియా, 2.03 బిలియన్ డాలర్ల తో ఇరాక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.