Indian Military: భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి రూ. 79,000 కోట్లతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని ‘‘డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్’’ ఆమోదం తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కోసం అత్యాధునిక ఆయుధాలు, వ్యవస్థల్ని కొనుగోలు చేయనున్నారు. సౌత్ బ్లాక్‌లో జరిగిన రక్షణ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇండియన్ ఆర్మీ కోసం:
భారత సైన్యం అత్యాధునిక ‘‘నాగ్ మిస్సైల్ సిస్టమ్ ట్రాక్డ్ ఎంకే-2’’ను అందుకోనుంది. ఇది శత్రు భూభాగంలో అత్యంత ఖచ్చితత్వంతో శత్రువులు బంకర్లను, ట్యాంకుల్ని నాశనం చేయగలదు. భూ-ఆధారిత మొబైల్ ELINT వ్యవస్థను సైన్యం తీసుకోనుంది. ఇది శత్రువుల సంకేతాలను 24 గంటల పాటు పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది రియల్ టైమ్‌లో శత్రువులపై అవగాహనను అందిస్తుంది. యుద్ధ భూమిలో భారత్‌కు సమాచార ఆధిపత్యాన్ని అందిస్తుంది.
ఇండియన్ నేవీకి పెద్ద పీట:
హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఇండియన్ నేవీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ (LPDలు)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది శక్తివంతమైన ఉభయచర దాడులకు కీలకం కానుంది. DRDO నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ అభివృద్ధి చేసిన స్వదేశీ అడ్వాన్స్‌డ్ లైట్ వెయిట్ టార్పెడో, నీటి అడుగున దాడి సామర్థ్యాలను పెంచుతుంది, భారతీయ యుద్ధనౌకలు సాంప్రదాయ, అణు లేదా మినీ శత్రు జలాంతర్గాములను సాటిలేని ఖచ్చితత్వంతో వేటాడి నాశనం చేయడానికి వీలు కల్పిస్తుంది. 30mm నావల్ సర్ఫేస్ గన్స్ తీరప్రాంత రక్షణ, యాంటీ పైరసీ కార్యకలాపాలను బలోపేతం చేస్తుంది. ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్(EOIRST) వ్యవస్థలు నౌకలు చీకటి, పొగమంచు పరిస్థితుల్లో శత్రువుల ఆస్తుల్ని గుర్తించడానికి సహకరిస్తుంది. 76mm సూపర్ రాపిడ్ గన్ మౌంట్‌ల కోసం స్మార్ట్ మందుగుండు సామగ్రిని అందించడం ద్వారా భారతీయ యుద్ధనౌకలు ఖచ్చితమైన దాడులకు వెసులుబాటు కలుగుతుంది.
ఎయిర్‌ఫోర్స్ కోసం:
ఇక భారత వైమానిక దళంలో కోసం CLRTS/DS లాంగ్ రేంజ్ టార్గెట్ సాచురేషన్/డిస్ట్రక్షన్ సిస్టమ్‌ను అందించబోతున్నారు. ఈ డ్రోన్ ఆధారిత స్వయంప్రతిపత్తి వ్యవస్థ ఆటోమేటిక్ టేకాప్, ల్యాండింగ్, ఆటోమెటిక్ నావిగేషన్, ఖచ్చితమైన పేలోడ్‌లను డెలివరీ చేయగలుగుతుంది. శత్రు భూభాగంలో నిఘా, పిన్ పాయింట్ దాడులను చేయగలదు.
