Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్

  • ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి..
  • మూడు దేశాలకు వెళ్లొద్దని ఇండియా హెచ్చరిక..
Ebola Outbreak

Ebola Outbreak

Ebola outbreak: ఆఫ్రికా దేశాల్లో ‘‘ఎబోలా వైరస్’’ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. భారత్ కూడా ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ దేశాలకు వెళ్లొద్దని భారత్ తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మూడు దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది.

ఇదే కాకుండా, ఈ దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియా-ఆఫ్రికా సమ్మిట్‌ను భారత్ వాయిదా వేసింది. ఢిల్లీలో జరగాల్సిన ఈ కీలక సమావేశం వైరస్ మూలంగా వాయిదా పడింది.

ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వైరస్‌కు ప్రస్తుతానికి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం, రక్తస్రావం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన చికిత్స అందకపోతే ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.