Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025లో సీనియర్ సిటిజన్లకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. వీరికి ఉపయోగపడేలా కీలకమైన పన్ను సంస్కరణల్ని ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని రూ. 50,000 నుండి రూ. 1,00,000 కు పెంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ ప్రకటనను సీనియర్ సిటిజన్లు స్వాగతిస్తున్నారు. దీని వల్ల మెరుగైన ఆర్థిక ఉపశమనం ఉండటంతో పాటు, వారిపై పన్ను భారం తగ్గబోతోంది, వారి పొదుపును పెంచే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉండబోతోంది.
చాలా పాత జాతీయ పొదుపు పథకం(ఎన్ఎస్ఎస్) ఖాతాలపై వడ్డీ రావడం లేదు కాబట్టి, వ్యక్తులు ఇప్పుడు వారి పొదుపుని ఉపసంహరించుకునే అవకాశం ఉందని, వీటిపై ఎలాంటి పన్నులు విధించబడవని సీతారామన్ చెప్పారు. ‘‘చాలా మంది సీనియర్ మరియు వెరీ సీనియర్ సిటిజన్లు చాలా పాత జాతీయ పొదుపు పథకం ఖాతాలను కలిగి ఉన్నారు. అటువంటి ఖాతాలపై వడ్డీ ఇకపై చెల్లించబడదు కాబట్టి, ఆగస్టు 29, 2024న లేదా ఆ తర్వాత నుంచి వ్యక్తులు NSS నుండి చేసే ఉపసంహరణలకు మినహాయింపు ఇవ్వాలని నేను ప్రతిపాదిస్తున్నాను. సాధారణ NPS ఖాతాలకు అందుబాటులో ఉన్న విధంగానే NPS వాత్సల్య ఖాతాలకు కూడా పరిమితులకు లోబడి ఇలాగే అనుమతించాలని నేను ప్రతిపాదిస్తున్నాను,’’ అని అన్నారు.
ఈ చర్య సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పొదుపు పెంచడంతో పాటు వినియోగాన్ని పెంచడానికి కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. టీసీఎస్ పరిమితిని రూ. 7 లక్షల నుంచి రూ. 10 పెంచడం, సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితిని రెట్టింపు చేయడం గణనీయమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. సీనియర్ సిటిజన్లకు పన్ను బాధ్యతల్ని తగ్గించడం ద్వారా పదవీవిరమణ చేసిన వారికి, వృద్ధులకు ఎక్కువ ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది.