Site icon NTV Telugu

Stray Dog: వీధి కుక్కల బెడదని అడ్డుకునేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీ..

Stray Dogs

Stray Dogs

Stray Dog: వీధి కుక్కల బెదడను అరికట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ఓ కమిటీనే ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వీధికుక్కల దాడులపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది. వీధుల్లో, నివాస ప్రాంతాల్లో, చివరకు పాఠశాలల్లో కూడా కుక్కల బెదడ తీవ్రం కావడం రాష్ట్రంలో ఆందోళనకరంగా మారింది. దీంతో అడిషనల్ చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు ఐఏఎస్ అధికారులతో సహా 15 మందితో కమిటీని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: Train Accident: వీడిన దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం మిస్టరీ..కారణం ఇదే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏటా 21,000 కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నాయి. గత ఐదేళ్లలో వీధికుక్కల కాటు వల్ల రేబిస్ సోకడంతో ఐదుగురు మరణించారు. రాజధాని భోపాల్‌లోని ఆస్పత్రిలోనే రోజుకు సగటున 55 కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. జూలై 1న, భోపాల్‌లోని లాల్‌ఘటికి చెందిన కునాల్‌ను ఒక కుక్క దాడి చేయడంతో ఎనిమిది కుట్లు వేయాల్సి వచ్చింది. ఐదు రోజుల తర్వాత, 16 ఏళ్ల రవి సాహు తన కుటుంబంతో కలిసి రైసెన్‌లోని ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్నప్పుడు వీధికుక్కల దాడికి గురయ్యాడు. జూలై 9న, హోషంగాబాద్‌లోని సేతాని ఘాట్‌లో ఒక వ్యక్తిపై వీధికుక్కలు దాడి చేయడంతో అతని కాలుపై లోతైన గాయాలు అయ్యాయి.

క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ షెల్టర్ హోమ్‌లో వీధి కుక్కలు కిక్కిరిసి పోయాయి. రేబిస్ ఇంజెక్షన్ కోసం ప్రతీరోజూ డజన్ల కొద్దీ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. హాస్పిటల్ డేటా ప్రకారం.. 2022లో 8,124 కుక్కకాటు సంఘటనలు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య దాదాపు రెండింతలు పెరిగి 16,387కి చేరుకుంది. 2024 మొదటి ఐదు నెలల్లో కుక్కకాటుకు సంబంధించి 7,728 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version