NTV Telugu Site icon

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ విచారణ మొదలు.. కీలకంగా 6 అంశాలు..

West Bengal Pg Doctor Case

West Bengal Pg Doctor Case

Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్నారు. ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐకి నిన్న అప్పగించింది. విచారణలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యాన్ని తూర్పారపట్టింది. హత్యాచారం జరిగిన తర్వాత పరిపాలన అధికారులు యాక్టివ్‌గా స్పందించకపోవడాన్ని ఎత్తిచూపింది. గత శుక్రవారం కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు.

మహిళా ప్రైవేట్ భాగాల నుంచి, ముక్కు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం వచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మెడ ఎముక విరిగినట్లు తేలింది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ అయింది. ఆమె పెదవులు, ఉంగరపు వేలిపై గాయాలతో పాటు ముఖంపై గోటి రక్కిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే, ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన సమయంలో మృతదేహం దొరికిన సెమినార్ హాలు నుంచి ఇతను బయటకు రావడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో పాటు సంఘటన స్థలంలో దొరికిన బ్లూటూత్ హెడ్‌ఫోన్ ఇతడి మొబైల్‌తో ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయింది.

Read Also: Andhra Pradesh: వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌లకు బిగ్‌ షాక్.. డీజీపీ కీలక ఆదేశాలు

ఇదిలా ఉంటే ఈ కేసులు సీబీఐ విచారణ ప్రారంభించింది. ముఖ్యంగా 6 అంశాలపై సీబీఐ దృష్టిసారించినట్లు తెలుస్తో్ంది. 1) వైద్యురాలిపై ఒక వ్యక్తి లేదా అనేక మంది అత్యాచారం చేశారా..?, 2) నిందితుడు ఆ సమయంలో ఒంటరిగా ఉన్నాడా..?, 3) సంఘటన తర్వాత సాక్ష్యాలు నాశనం చేయబడటం, 4) హత్య ఎందుకు ముందుగా ఆత్మహత్యగా నివేదించబడింది..?, 5) ఆస్పత్రి పరిపాలన ప్రమేయం ఉందా..?, 6) వైద్యురాలి హత్య రాత్రి జరిగితే ఉదయమే ఎందుకు పోలీసుకు సమాచారం ఇచ్చారు..? అనే అనుమానాలపై ముందుగా విచారించనున్నట్లు తెలుస్తోంది.

సీబీఐ తరుపున వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణులతో కూడి టీం కోల్‌కతాలో ఉంది. సీబీఐ SC1, లేదా స్పెషల్ క్రైమ్ యూనిట్, వేలిముద్రలు, పాదముద్రలు మరియు ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాల కోసం నేరస్థలాన్ని పరిశీలిస్తుందని, ఇది నిందితుడి ఉనికిని నిర్ధారిస్తుందని అధికారులు చెబుతున్నారు. నేరం జరిగిన స్థలంలో ఉన్నవారిని గుర్తించడానికి బెంగాల్ రాష్ట్ర పోలీసులు సాక్ష్యాలు సమీక్షించడానికి, సంజయ్ రాయ్ స్టేట్‌మెంట్‌ని మళ్లీ రికార్డు చేయడానికి సీబీఐ టీం మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తోంది. ఘటన జరిగిన రాత్రి ఆమెతో డిన్నర్ చేసిన నలుగురు, పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులు, వైద్యులతో సహా ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ స్నేహితుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫులేజీని స్వాధీనం చేసుకున్నారు.

Show comments