NTV Telugu Site icon

BJP: “అయోధ్య రాముడి” నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్లాన్..

Bjp

Bjp

BJP: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ సిద్ధమవుతోంది. మూడోసారి వరసగా అధికారంలోకి వచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 50 శాతం ఓట్లను పొందడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసింది. జనవరి 22, 2024లో అయోధ్యంలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. మోడీ హయాంలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ నెరవేరబోతోంది. అయితే అయోధ్య రామమందిర ప్రతిష్టాపనను సద్వినియోగం చేసుకోవాలని పార్టీ, కార్యకర్తలను కోరింది.

పార్టీ ఆఫీస్ బేరర్‌లతో ఇటీవల బీజేపీ రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను గురించి చర్చించారు. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. వీరు పార్టీ శ్రేణులకు బలమైన సందేశాన్ని ఇచ్చారు.

Read Also: Bengaluru: బెంగళూర్‌ దుకాణాల సైన్‌బోర్డుల్లో 60 శాతం కన్నడలో ఉండాల్సిందే..

రాముడే కొండంత బలంగా:

రామ మందిర ప్రతిష్టాపన వేడుకలనే బీజేపీ విజయానికి మూలస్తంభంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వేడుకలను ఎన్నికల ప్రచారం అంశంలో సమర్థవంతంగా ఉపయోగించుకుని ఓట్లు రాబట్టేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. రామ మందిర ఉద్యమం, ఆలయ నిర్మాణంలో బీజేపీ పాత్రను తెలియజేసేలా బుక్‌లెట్ విడుదల చేయనున్నారు. కొత్త ఓటర్లను కనెక్ట్ కావడానికి, వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు బూత్ స్థాయి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తమ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు ఆలయ నిర్మాణాన్ని ఎలా అడ్డుకోవడానికి ప్రయత్నించాయనే విషయాన్ని కూడా బీజేపీ హైలెట్ చేయనుంది. రామ మందిరానికి సంబంధించి ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నిర్వహించే అన్ని కార్యక్రమాలకు బీజేపీ మద్దతు ఇవ్వనుంది.

భారీ మెజార్టీ టార్గెట్:

రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో, బీజేపీ అధిక మార్జిన్‌తో విజయం సాధించడమే టార్గెట్‌గా పెట్టుకోవాలని ఆఫీస్ బేరర్లకు అమిత్ షా సూచించారు. అధిక తేడాతో గెలుస్తామని నిర్ధారించుకోవాలని, దీంతో ప్రతిపక్షాలు బీజేపీ ముందు నిలబడేందుకు ధైర్యం చేయవని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో బలంగా ఉన్నాము, ఇతర చోట్ల బలహీనంగా ఉన్నామనే భావన వదిలేయాలని, బలహీనమైన స్థానాలు ఏమీ లేవని ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఇదిలా ఉంటే ఎన్నికల కంటే చాలా ముందుగానే ఎన్నికల్లో బలహీనంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.