BJP: 5 రాష్ట్రాల ఎన్నికల గురించి కేంద్రంమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్(APEC)లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లారు. అయినా కూడా స్వదేశంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ ముందంజలో ఉందని, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో బీజేపీ గెలుస్తుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఓడిపోతుందని పలు ఒపీనియన్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొనగా.. మిజోరాంలో పరిస్థితి అస్పష్టంగా ఉంది.
Read Also: Malreddy Rangareddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలను అమలుచేసి తీరుతాం..
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తాను విస్తృతంగా పర్యటించానని ఈ రాష్ట్రాల్లో బీజేపీ బాగా పనిచేస్తుందని, రాజస్థాన్ లో ఏకపక్షంగా విజయం సాధిస్తామని, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా ప్రజలు బీజేపీకి విజయాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని పీయూష్ గోయల్ అన్నారు. భారత్ తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణలో పరిస్థితిని చూస్తానని, తెలంగాణలో నవంబర్ 30న ఓటింగ్ ఉంది, అమెరికా వెళ్లకుముందు రెండుసార్లు మాత్రమే తెలంగాణ వెళ్లానని, ఒకసారి పర్యటిస్తే క్షేత్రస్థాయి పరిస్థితి తెలుస్తుందని ఆయన అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
యూఎస్ పర్యటన ముఖ్యంగా టెస్లా టీంని కలవడం కోసమే అని ఆయన అన్నారు. భారత్ వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలను(ఈవీ)లను స్వీకరిస్తోందని, దాదాపుగా 40 శాతం ద్విచక్ర వాహాలు ఇప్పడు EVలుగా ఉన్నాయని, వాణిజ్య బస్సులు, క్యాబ్ ల కోసం కూడా ఈవీలను ఉపయోగిస్తున్నారని పీయూష్ గోయల్ అన్నారు. రాబోయే 10 ఏళ్లలో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని, ప్రభుత్వం కూడా చాలా ఈవీలను కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు.