Imran Masood: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తన కుటుంబంలో రాజకీయాలు పెట్టిన చిచ్చు గురించి మాట్లాడారు. జాతీయ ఛానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన అల్లుడు షయాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరడాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కుటుంబం విచ్ఛిన్నమవ్వడం బాధాకరంగా ఉందని అన్నారు. తన కూతురు గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉందని ఇమ్రాన్ అన్నారు. రాజకీయాలు, కుటుంబ సంబంధాలు వేర్వేరు అంశాలని, రాజకీయాల వల్ల కుటుంబాలు దెబ్బతినడం మంచిది కాదని అన్నారు.
షయాన్ మసూద్ ఆగస్టులో కాంగ్రెస్‌ను వీడి ఎస్పీలో చేరారు. తన మామ ఇమ్రాన్ మసూద్ రాజకీయ ఆలోచనలతో తాను ఏకీభవించనని పార్టీలో చేరుతూ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ.. తన కూతురు, చిన్న పిల్లతో తన ఇంట్లో ఉండటం చూస్తే బాధకరంగా ఉందని అన్నారు. తన అల్లుడు ఎస్పీలో చేరడం నేరం కాదని, అయితే తన కూతురుని వదిలేయడమే బాధకరమని అన్నారు.
కుటుంబంలో ఏర్పడిన రాజకీయ పరిణామాలు తనను బలహీనపరచలేదని చెప్పారు. మరింత బలంగా మారేందుకు దోహదం చేస్తాయని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ పేపర్ లీకులపై, నిరుద్యోగంపై మాట్లాడుతూ..వివిధ విభాగాల్లో కాంట్రాక్టు విధానం పెరిగిపోయిందని, పరీక్షలు నిర్వహించే సంస్థల నుంచి ఉద్యోగుల వరకు అనేక వ్యవస్థలు కాంట్రాక్టు పద్ధతిలో నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. మైనారిటీలు, ముస్లిం రాజకీయాలపై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏ ఒక్క కులం లేదా మతానికి చెందిన పార్టీ కాదని చెప్పారు.

