NTV Telugu Site icon

Bangladesh MP: చర్మం వలిచి, శరీరం నుంచి ఎముకలు వేరు చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు..

Bangladesh Mp

Bangladesh Mp

Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి ఆయన ఈ నెల 12న కోల్‌కతా వచ్చారు. మే 14 నుంచి కనిపించకుండా పోయారు. ఎంపీ హత్యకు సంబంధించి ఓ అనుమానితుడి బెంగాల్ సీఐడీ టీం ఒకరిని అరెస్ట్ చేయడంతో భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ ఖుల్నా జిల్లాకు చెందిన అక్రమ వలసదారు ఎంపీని హత్య చేసి, అత్యంత క్రూరంగా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

అనుమానితుడు జిహాద్ హవ్లాదర్ వృత్తిరీత్యా కసాయి. బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలోని బరాక్‌పూర్ నివాసి. ముంబైలో అక్రమంగా ఉంటున్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. హవ్లాదార్‌ని ఎంపీకి స్నేహితుడైన అక్తరుజ్జమాన్ అనే అమెరికా సిటిజన్ నియమించుకున్నాడు. కోల్‌కతాలో ఇతని అపార్ట్‌మెంట్‌లోనే ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు గురయ్యాడు. రెండు నెలల క్రితమే హంతకుడు కోల్‌కతా వచ్చినట్లు తేలింది.

Read Also: Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ

కోల్‌కతా విమానాశ్రయానికి సమీపంలోని ఓ హోటల్‌లో హవ్లాదార్ బసచేసినట్లు, ఎంపీని చంపేందుకు అక్తరుజ్జమాన్ రూ. 5 కోట్లు ఖర్చు చేశాడని, ఇందులో వాటా కూడా హవ్లాదార్‌కి ఇచ్చినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో తాను, మరో నలుగురు కలిసి బంగ్లాదేశ్ ఎంపీని హతమార్చినట్లు హవ్లాదార్ ఒప్పుకున్నాడు. అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకే హత్య జరిగిందని వెల్లడించారు.

హత్య తర్వాత ఎంపీ మృతదేహం చర్మాన్ని వలిచి, బాడీని గుర్తు పట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికి, మాంసం నుంచి ఎముకలను వేరు చేసి, ప్లాస్టిక్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో విసిరేశారు. మే 13న కోల్‌కతా నుంచి అదృశ్యమైన ఎంపీ హత్యకు గురయ్యారని, ముగ్గురిని అరెస్టు చేశామని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు. బంగ్లాదేశ్ అధికార షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఎంపీగా ఉన్న అన్వురల్ అజీమ్ అన్వర్ మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మే 12న కోల్‌కతా చేరుకున్న అతను, ఆయన స్నేహితుడు బిశ్వాస్ ఇంట్లో ఉన్నాడు. మే 13న వైద్యుడి వద్దకు వెళ్తున్నానని చెప్పి మిస్ అయ్యాడు. ఆ తర్వాత బిశ్వాస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.