IIT Delhi: ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. రాజస్థాన్ కోటా ప్రాంతంలో ఇటీవల కాలంలో వరసగా విద్యార్థుల బలవన్మరణాలు కలవరపెడుతున్నాయి. చదువుల ఒత్తిడి, తల్లిదండ్రులు కోరికను నెరవేర్చలేమో అనే బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దేశంలో అత్యున్నత యూనివర్సిటీ అయిన ఐఐటీల్లో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఐఐటీ మద్రాస్‌లో వరసగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఐఐటీ ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల విద్యార్థి అనిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అకడమిక్ ఒత్తడి కారణంగా హస్టల్ గదిలో ఉరివేసుకుని మరణించాడు. శుక్రవారం తన హాస్టల్ గదిలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అయితే ఎలావంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు వెల్లడించారు. అయితే విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే విద్యార్థి ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్నారు.
అనిల్ కుమార్ ఆత్మహత్య విషయాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హస్టల్ వర్గాలు పోలీసులకు తెలియజేశాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హస్టల్ గదికి లోపల నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. ఉరేసుకుని ఉన్న విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు, అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. మ్యాథ్స్, కంప్యూటింగ్‌లో బీటెక్ చదువుతున్న విద్యార్థికి గతంలో కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయి ఉండటంతో ఆరు నెలలుగా హాస్టల్ గదిలో ఉంటున్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.