Bulldozer Action: ఉత్తర్ ప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో ఇటీవల దుర్గా నిమజ్జనం సమయంలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రాను వేరే వర్గం వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో పోలీసులు మహ్మద్ ఫహీన్, మహ్మద్ సర్ఫరాజ్, అబ్దుల్ హమీద్, మహ్మద్ తలీమ్ అలియాస్ సబ్లూ మరియు మహ్మద్ అఫ్జల్‌ని అరెస్ట్ చేశారు. నేపాల్ పారిపోతున్న సమయంలో మహ్మద్ తలీమ్, మహ్మద్ సర్ఫరాజ్‌లను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి పట్టుకున్నారు.
Read Also: UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
అయితే, ఈ కేసు తర్వాత ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ నిందితుల ఇళ్లపై బుల్డోజర్ యాక్షన్‌కి దిగింది. నిందితుల కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లను కూల్చివేస్తున్నట్లుగా నోటీసులు ఇచ్చింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టు కూల్చివేత నోటీసులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించింది. ప్రభుత్వానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. ‘‘వారు (యుపి అధికారులు) మా ఆర్డర్‌ను ఉల్లంఘించే రిస్క్ తీసుకోవాలనుకుంటే, అది వారి ఇష్టం’’ అని జస్టిస్ గవాయ్ ఈ రోజు అన్నారు. అయితే, నిర్మాణాలు చట్టవిరుద్ధమైతే తాము జోక్యం చేసుకోబోమని ‘‘బుల్డోజర్ జస్టిస్’’కేసులో తమ ఉత్తర్వులు పేర్కొన్నట్లు కోర్టు తెలిపింది. రేపు తదుపరి విచారణకు ముందు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్ ప్రదేశ్ సర్కార్‌ని కోరింది.
పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదించారు. అక్టోబర్ 13న హింసాకాండ జరిగిన తర్వాత స్థానిక అధికారులు కూల్చివేత నోటీసులు ఇచ్చి మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు. అంతకుముందు, అలహాబాద్ హైకోర్టు కూల్చివేత నోటీసులకు రిప్లై దాఖలు చేయడానికి గడువును 15 రోజులకు పొడిగించింది, ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ కోర్టుకు హామీ ఇచ్చారు.