Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో అధికారంలో వచ్చింది. గత నాలుగు రోజులుగా ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం విస్తృతంగా చర్చలు నిర్వహించింది. చివరకు సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించింది. వీరిద్దరు కూడా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత జీ పరమేశ్వర పార్టీ అధిష్టానికి హెచ్చరికలు చేశారు.
దళిత నాయకుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుంటే వారికి అన్యాయం జరిగిందనే భావన వాళ్లలో ఉంటుందని, డిప్యూటీ సీఎం దక్కుతుందని దళితులు భారీ ఆశలతో ఉన్నారని పరమేశ్వర అన్నారు. 71 దళిత నాయకుడు అయిన పరమేశ్వర అంతకుముందు సీఎం రేసులో కూడా ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ ఏకైక డిప్యూటీ సీఎంగా, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉంటారని కాంగ్రెస్ నిర్ణయించింది.
Read Also: Karnataka: మా కరెంట్ బిల్లులు కాంగ్రెస్ కడుతుంది.. వారి నుంచే తీసుకోవాలి..
డిప్యూటీ సీఎం పదవి దళితులకు ఇవ్వకపోతే ప్రతిచర్యలు ఉంటాయని.. తర్వాత తెలుసుకునే బదులు ఇప్పుడే సరిదిద్దుకుంటే బాగుంటుందని, లేకుంటే పార్టీకి ఇబ్బంది కలగవచ్చని పరమేశ్వర అన్నారు. తాను సీఎం, డిప్యూటీ సీఎం రెండు పదవులపై ఆశలు పెట్టుకున్నానని అన్నారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఎలా న్యాయం చేస్తారో చూడాలని ఆయన అన్నారు.
తుమకూరు జిల్లా కొరటగెరె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరమేశ్వర 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఓడిపోయారు. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఆ తర్వాత పరమేశ్వరకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిగా చేశారు. హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో 71 ఏళ్ల జి పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా సుదీర్ఘకాలం పనిచేశారు.
