‘అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం జూన్ 24న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆరురోజుల వ్యవధిలోనే లక్షా 83వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తెచ్చిన కొత్త పథకానికి మంచి ఆదరణ కనిపిస్తోందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుందని.. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇదిలా ఉంటే, త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ 14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్మెంట్లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తులు భారీగా వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగానూ మారాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసే యోచనలోనూ ఉన్నాయి. దీనికి దరఖాస్తుల గడువు వచ్చే నెల 5న ముగియనుంది. అంటే మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉందని అధికారులు చెప్పారు. ఈ ఆరు రోజుల్లో అప్లికేషన్ల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Viral Video: గంగానదిలో దూకిన 70 ఏళ్ల ముసలామె.. ఆశ్చర్యంలో నెటిజన్లు