NTV Telugu Site icon

Bengaluru chilling murder: ఫ్రిజ్‌లో, సూట్‌కేసులో 50 ముక్కలుగా మహాలక్ష్మీ శరీరం.. అష్రాఫ్‌పై భర్త అనుమానం..

Bengaluru Woman

Bengaluru Woman

Bengaluru chilling murder: శ్రద్ధావాకర్ తరహాలోనే బెంగళూర్‌లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణ హత్య జరిగింది. ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన వైనం ఒళ్లు గగుర్పాటు గురయ్యేలా ఉంది. తాజాగా ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సోమవారం తెలిపారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, నిందితుడికి సాయం పడేలా ప్రస్తుతానికి తాము ఏ వివరాలను బహిర్గతంగా వెల్లడించలేమని చెప్పారు. నిందితుడు వేరే రాష్ట్రానికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు.

అయితే, ఈ హత్య కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్రిజ్‌తో పాటు మహాలక్ష్మీ నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్రిజ్ పక్కనే బ్లూ కలర్ సూటికేస్‌లో మరిన్ని శరీరభాగాలు దొరికనట్లు తెలుస్తోంది. నిందితుడు మృతదేహాన్ని తరలించే ఉద్దేశంలో ఉన్నాడా..? లేక వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిందని, నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

Read Also: MUDA land scam case: భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్ట్ బిగ్ షాక్..

ఈ కేసులో మహాలక్ష్మీ భర్త హేమంత్ దాస్‌ని పోలీసులు విచారించారు. అయితే, ఆయన ఈ హత్యలో మహాలక్ష్మీ లవర్ పాత్ర ఉంటుందని అనుమానించాడు. తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఆమె ప్రేమికుడు ఈ హత్యలో పాల్గొని ఉండొచ్చని పేర్కొన్నాడు. హత్య వెనక ఉత్తరాఖండ్‌కి చెందిన అష్రాఫ్ హస్తం ఉండొచ్చని, కొద్ది నెలల క్రితం బెంగళూర్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు తర్వాత అతను బెంగళూర్ రాకూడదని ఆదేశించారని, అయితే, అతను ఎక్కడి వెళ్లిన విషయం తనకు తెలియదని అన్నాడు.

హేమంత్ దాస్‌కి మహాలక్ష్మికి 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే, కుటుంబ కలహాలతో తొమ్మిది నెలలుగా వీరిద్దరు విడిగా ఉంటున్నారు. “అష్రాఫ్ ఉత్తరాఖండ్ నుండి వచ్చాడు. వివాహేతర సంబంధం గురించి తెలియడంతో మేము ఫిర్యాదు చేసాము. ఇది అనుమానం కాదు, నాకు తెలుసు. అష్రఫ్ బార్బర్ షాప్‌లో పనిచేస్తున్నాడు. నాకు 2023 ఏప్రిల్ లేదా మేలో ఈ వ్యవహారం తెలిసింది. అష్రఫ్ గురించి మహాలక్ష్మి నాకు ఏమీ తెలియచేయలేదు, నేను ఆమెతో టచ్‌లో లేను…,” అని చెప్పాడు.

సెప్టెంబరు 22న బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఒక గది ఫ్లాట్‌లో మహాలక్ష్మి (29) మృతదేహాన్ని కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గది నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇంటి యజమాని మహాలక్ష్మీ తల్లికి, సోదరికి సమాచారం అందించారు. ముగ్గురు కలిసి డోర్ పగలగొట్టి చూడగా ఆమె తెగిపడిన మృతదేహాన్ని చూశారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందర్ని పట్టుకుంటామని హోంమంత్రి పరమేశ్వర సోమవారం విలేకరులతో అన్నారు.