Site icon NTV Telugu

West Bengal: ” రీల్స్” చేస్తుందని అభ్యర్థి తొలగింపు.. “హిందువు” కాబట్టే తొలగించారని ఆరోపణ

Bengal

Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదును నిర్మిస్తామని చెబుతూ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా మారారు. బాబ్రీ వివాదం కారణంగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుమాయున్ కబీర్ సొంతగా ‘‘జనతా ఉన్నయన్ పార్టీ’’ని స్థాపించాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో తన పార్టీ తరుపున తాత్కాలిక అభ్యర్థుల జాబితా నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిషా ఛటర్జీని తొలగించారు. బల్లిగంజ్ నియోజవర్గం నుంచి టీఎంసీ కీలక నేత బాబుల్ సుప్రీయోకు వ్యతిరేకంగా నిషా ఛటర్జీని తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించి, కొంత సేపటికే ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.

Read Also: Rahul Gandhi: బీజేపీ విధానాలతో వైశ్య వ్యాపారులు దెబ్బతిన్నారు.. పోరాటం చేయాలని రాహుల్‌గాంధీ పిలుపు

సోషల్ మీడియాలో నిషా ఫోటోలు, రీల్స్ చూశానని, ఆమెను తమ పార్టీ అభ్యర్థిగా పెడితే తప్పుడు సందేశాన్ని పంపుతుందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నానని కబీర్ చెప్పారు. త్వరలోనే కొత్త అభ్యర్థిని ప్రకటిస్తానని, ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి కావచ్చని ఆయన సూచించారు. అయితే, దీనిపై నిషా మాట్లాడుతూ.. మతం కారణంగా తనను తొలగించారని, తాను హిందువు కాబట్టే తనను పార్టీ నుంచి తొలగించినట్లు చెప్పింది. ఆయనది లౌకిక పార్టీ అయితే ఇలా జరిగేదా? అని ప్రశ్నించింది. బాబ్రీ మసీదుకు తాను మద్దతు ఇచ్చినప్పటికీ, తనను ఎందుకు తొలగించారని నిషా ఛటర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుమాయున్ కబీర్ పార్టీ బెంగాల్‌లోని 249 స్థానాలకు గానూ 135 స్థానాల్లో పోటీ చేస్తుందని, సామాన్యులతో పాటు ముస్లింల కోసం పనిచేస్తుందని చెప్పారు. తన పార్టీ నుంచి 70 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటాయని అన్నారు. అయితే, కొత్త పార్టీని టీఎంసీ తేలికగా తీసుకుంటుందని టీఎంసీ ప్రతినిధి జయప్రకాశ్ మజుందార్ అన్నారు. అయితే, కబీర్ పార్టీ గురించి బీజేపీ మాట్లాడుతూ.. టీఎంసీతో కలిసి బీజేపీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Exit mobile version