Site icon NTV Telugu

Operation Sindoor: టెర్రరిస్ట్ అబ్దుల్ రౌఫ్ అజార్ హతం.. యూఎస్ జర్నలిస్ట్ హత్యకు భారత్ ప్రతీకారం..

Terrorist Abdul Rauf Azhar , Us Journalist Daniel Pearl

Terrorist Abdul Rauf Azhar , Us Journalist Daniel Pearl

Operation Sindoor: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు, ఆ ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజార్‌ని భారత హతం చేసింది. బుధవారం తెల్లవారుజామున పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకేల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద కార్యాలయాలు, వాటి శిక్షణా శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో, జైషే టాప్ కమాండర్ అబ్దుల్ రౌఫ్ అజార్ కూడా ఉన్నాడు.

1974లో పాకిస్తాన్‌లో జన్మించిన ఈ ఉగ్రవాది 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC 814 హైజాక్‌ కీలక కుట్రదారుల్లో ఒకరు. భారత్ ఈ హైజాక్‌కి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. ఇక్కడ మరో సంచలన విషయం కూడా ఉంది. అమెరికా జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్‌ హత్యకు కూడా ప్రస్తుతం యూఎస్ తరుపున ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది.

కాట్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న IC 814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, ఆఫ్ఘనిస్థాన్ కాందహార్ తరలించారు. భారత ప్రయాణికులను విడుదల చేయడానికి అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం, భారత జైళ్లలో ఉన్న భయంకరమైన ఉగ్రవాదులైన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముష్తాక్ జర్గర్, మసూద్ అజార్‌లను విడుదల చేయాల్సి వచ్చింది. దీని తర్వాతే మసూద్ అజార్ ‘‘జైషే మహ్మద్ ’’ ఉగ్ర సంస్థను స్థాపించాడు.

డేనియల్ పెర్ల్ కిడ్నాప్, హత్య:

జనవరి 23, 2002న, వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) రిపోర్టర్ డేనియల్ పెర్ల్‌ని జైషే మహ్మద్ ఉ గ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదులపై తన పరిశోధనల్లో భాగంగా పాకిస్తాన్ కరాచీలో ఒక మత నాయకుడిని ఇంటర్వ్యూ కోసం వెళ్లాడు. ఆ సమయంలో కొందరు ఉగ్రవాదులు హోటల్ సమీపంలో కిడ్నాప్ చేశారు.

4 రోజుల తర్వాత, గొలుసులతో బంధించి ఉన్న పెర్ల్ ఫోటోలను విడుదల చేశారు. పెర్ల్ కిడ్నాప్‌లో హైజాక్ ద్వారా విడుదల చేయబడిన అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ కీలకంగా ఉన్నాడు. ఇతడే పెర్ల్‌ని అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి, తల నరికి చంపేశాడు. ఈ కుట్రలో అబ్దుల్ రౌఫ్ అజార్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌లో రౌఫ్‌ని హతమార్చడం ద్వారా పెర్ల్‌కి న్యాయం జరిగింది.

అనేక ఉగ్రదాడుల్లో అబ్దుల్ రౌఫ్ అజార్ కీలక సూత్రధారి:

అబ్దుల్ రౌఫ్ అజార్, తన సోదరుడు జైషే చీఫ్ మసూద్ అజార్ లేనప్పుడు బాధ్యతలు చేపట్టేవాడు. భారత్‌లో అనేక దాడులకు ఇతడు కారణం. 2005లో, ఐదుగురు ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని రామజన్మభూమి స్థలంపై దాడి చేసి భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. 2016లో పఠాన్ కోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళంపై ఉగ్రదాడిలో కీలకంగా ఉన్నాడు. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. అజార్‌ భారత్, ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదుల్ని నియమించుకోవడం, దాడులకు ప్లాన్ చేసిన కారణంగా 2010లో అమెరికా ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, 2022లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అతన్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే భారతదేశ చర్యను చైనా అడ్డుకుంది.

Exit mobile version