American Independence: అమెరికా స్వాతంత్య్రానికి హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ సహాయం.. ఎలాగంటే..

  • అమెరికా స్వాతంత్య్రంలో హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పరోక్ష పాత్ర..
  • ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు..
American Independence

American Independence

American Independence: అగ్రరాజ్యం అమెరికా స్వాతంత్ర్యాన్ని పొంది 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్రిటన్‌పై జరిగిన స్వాతంత్ర్య యుద్ధాల తర్వాత విముక్తి అయింది. అయితే, అమెరికా స్వేచ్ఛను పొందడానికి ఒక రకంగా మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్‌లు ఒక కారణం అని చాలా తక్కువ మందికి తెలుసు. అందుకే ఇప్పటికీ అమెరికా వీరిద్దరి పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తుంటుంది. వీరు అమెరికా తరుఫున నేరుగా యుద్ధం చేయకున్నా, భారత్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం చాలా ప్రభావం చూపించిందని చరిత్రకారులు భావిస్తుంటారు.

1775లో అమెరికా స్వాతంత్ర్య యుద్ధాలు జార్జ్ వాషింగ్టన్ నేతృత్వంలో ప్రారంభయమ్యాయి. ఇదే సమయంలో హైదర్ అలీ బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం(1780-84) సాగింది. దీంతో బ్రిటన్ ఒకేసారి అటు అమెరికాలో, ఇటు మైసూర్‌లో యుద్ధం చేయాల్సి వచ్చింది. దీంతో బ్రిటిష్ సైన్యం, నేవీ అమెరికాపై పూర్థిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయింది. 1780లో పోలిలూర్ యుద్ధంలో హైదర్ అలీ సేనలు బ్రిటిష్ సైన్యాన్ని దారుణంగా ఓడించాయి. మైసూర్ పాలకుల విజయంతో ఆంగ్లేయులపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో ఫ్రాన్స్ అమెరికా విప్లవకారులకు, మైసూరుకు మద్దతు ఇవ్వడంతో బ్రిటిష్ పరిస్థితి క్లిష్టంగా మారింది.

ఆ సమయంలో హైదర్ అలీపై అమెరికాలో చాలా గౌరవం ఉండేది. ఆయన పేరుతో ‘‘హైదర్ అలీ’’ అనే యుద్ధ నౌకను కూడా నిర్మించారు. ఈ నౌక బ్రిటిష్ యుద్ధ నౌకలపై విజయం సాధించడంతో అమెరికాలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో అమెరికన్ కవులు హైదర్ అలీని ప్రశంసిస్తూ కవితలు రాశారు. ఆయన గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

1782లో హైదర్ అలీ మరణంతో రాజ్య బాధ్యతల్ని టిప్పు సుల్తాన్ స్వీకరించారు. ట్రిప్పు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. కొంత కాలం అమెరికన్ పుస్తకాల్లో టిప్పు ప్రస్తావన కూడా ఉండేది. 1799లో శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పు మరణించినప్పుడు, అమెరికాలోని మేధావులు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. నిజానికి, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ యుద్ధాలు అమెరికాకు స్వాతంత్య్రాన్ని సాధించపెట్టలేదు కానీ, ఓ రకంగా బ్రిటిష్ వారు తమ శక్తిని పూర్తిగా మైసూర్ యుద్ధంలో కేంద్రీకృతం చేయడంతో అమెరికా స్వాతంత్య్రం సులువైంది. పరోక్షంగా వీరిద్దరు సహకరించినట్లైంది.