NTV Telugu Site icon

Tipu Sultan: టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు..? కర్ణాటకలో మరో కాంట్రవర్సీ..

Tippu Sultan

Tippu Sultan

Tipu Sultan: టిప్పు సుల్తాన్ ను ఎవరు చంపారు..? ఇప్పుడు కర్ణాటకలో మరో వివాదం ముందుకు వచ్చింది. కర్ణాకటలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి వీడీ సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్ గా రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ సావర్కర్ పేరుతో ఇతర పార్టీలపై విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ వొక్కలిగ వర్గాన్ని దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

టిప్పు సుల్తాన్ ను బ్రిటిష్, మరాఠా సైన్యం చంపలేదని ఇద్దరు వొక్కలిగ నాయకులు చంపారని బీజేపీ వాదిస్తోంది. ఈ వాదనపై బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. వొక్కలిగ నాయకులు ఊరిగౌడ, నంజే గౌడ ఇద్దరు చంపారని బీజేపీతో పాటు ఓ వర్గం అంటోంది. అడ్డంగ కరియప్ప రచించిన టిప్పు నిజకనాసుగలు( టిప్పు నిజమైన కలలు) పుస్తకం ఆధారంగా బీజేపీ ఈ వాదనలు చేస్తోంది. అయితే దీన్ని పలువరు చరిత్రకారులు వ్యతిరేకించినప్పటికీ, వొక్కలిగా బీజేపీ నాయకులు అయిన సీటీ రవి, మంత్రులు అశ్వత్ నారాయన్, గోపాలయ్య సమర్థించారు. ఊరి గౌడ, నంజే గౌడ గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్న వారిలో కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే, అశ్వత్ నారాయణ వంటి బీజేపీ నేతలు కూడా ఉన్నారు.

Read Also: UK: భారత జెండాను చూసి ఖలిస్తానీలకు మంట.. మరోసారి హైకమిషన్ పై దాడి..

వొక్కలిగా సామాజికవర్గం ఇప్పటి వరక కాంగ్రెస్, కుమారస్వామి పార్టీ జనతాదళ్ సెక్యులర్‌కు మద్దతుగా ఉంది. అయితే ఊరి గౌడ, నంజే గౌడ ఉనికిలో లేరని, కేవలం కల్పిత పాత్రలే కావొచ్చని రెండు పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రమంత్రి మునియప్ప నిర్మాతగా మారి.. ‘‘ఉరిగౌడ, నంజేగౌడ’’ సినిమా తీయనున్నట్లు చెప్పారు. వొక్కలిగ గురువుగా భావించే శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం ప్రధాన పీఠాధిపతి నిర్మలానందనాథ మహాస్వామీజీ సినిమా తీసేముందు దీనికి సంబంధించిన శాసనాలు, చారిత్రక ఆధారాలు మఠానికి సమర్పించాల్సిందిగా ఆదేశించారు.

టిప్పు సుల్తాన్ వేల మందిని చంపి బలవంతంగా మతం మార్చాడని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, జేడీయూలు ఈ వాదనలను తోసిపుచ్చుతున్నాయి. గతంలో టిప్పు జన్మదినోత్సవాన్ని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. తాజాగా ఈ అంశం ఎన్నికల ప్రధాన నినాదంగా మారింది. ఏప్రిల్-మేలో కర్నాటకలో 224 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి, ఇందులో బీజేపీ గెలిచి వరుసగా రెండవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.