Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమిత్ షా అక్క రాజేశ్వరి బెన్ షా సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు లంగ్స్ మార్పిడి జరిగింది. ఈ సర్జరీ తర్వాత ఆమె కోలుకునే దశలో ఉన్నారు. ఈలోపే ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించారు.
ఈ వార్త తెలిసిన వెంటనే గుజరాత్‌లో వర్చువల్‌గా జరగాల్సిన రెండు సమావేశాలను అమిత్ షా రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమిత్ షా అక్క మరణం కారణంగా మంత్రి తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. అంతకుముందు గుజరాత్ లో రెండు కార్యక్రమాల్లో షా పాల్గొనాల్సి ఉంది. బనస్కాంత జిల్లాలోని దేవదర్ లోని బనాస్ డెయిరీ ప్రారంభం, గాంధీనగర్ లోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం కార్యక్రమాల్లో పాల్గొన్నాల్సి ఉంది. బనస్కాంత కార్యక్రమానికి హాజరైన గుజరాత్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్ మాట్లాడుతూ.. అమిత్ షా అక్కగారు చనిపోవడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని.. వారికి నివాళులు అర్పించారు.