HMPV Virus: మెటాన్యూమోవైరస్(HMPV)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ గురించి ఎవరూ ఆందోళనపడొద్దని, ఇది కొత్త వైరస్ కాదని, దేశ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. 2001లో తొలిసారి గుర్తించిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోందని, ప్రజారోగ్యాన్ని కాపాడటానికి అవసరమైన చర్యలను అమలు చేస్తుందని ప్రజలకు హామీ ఇస్తూ నడ్డా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Read Also: Survival Story : 438 రోజులు సముద్రం మధ్యలో ఎలా సర్వైవ్ అయ్యాడు?
‘‘HMPV కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. ఇది 2001లో మొదటిసారిగా గుర్తించబడింది, ఇది చాలా సంవత్సరాల నుండి ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. HMPV గాలి ద్వారా, శ్వాస ద్వారా వ్యాపిస్తుంది. ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. శీతాకాలం, వసంత ఋతువులో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది’’ అని జేపీ నడ్డా చెప్పారు.
కర్ణాటక, గుజరాత్‌లకు చెందిన ముగ్గురు పిల్లలకు HMPV పాజిటివ్ అని తేలిన తర్వాత జేపీ నడ్డా నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత ఆరోగ్య సంస్థలు పరిస్థితిని చురుకుగా పర్యవేక్షిస్తున్నాయని నడ్డా చెప్పారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) చైనా ఇతర దేశాల పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. దేశంలో శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్ల గణనీయమైన పెరుగుదల లేని కేంద్రమంత్రి చెప్పారు.