NTV Telugu Site icon

Pakistan: హోలీ జరుపుకున్నందుకు హిందూ విద్యార్థులను చితకబాదిన తోటి విద్యార్థులు

Holi

Holi

Pakistan: పాకిస్తాన్ లో మైనారిటీ హక్కులు ఎలా ఉంటోయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడి మైనారిటీలు అయిన హిందూ, సిక్కు, క్రైస్తవులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తుంటారు. మైనారిటీ బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి మతం మార్చి పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. మైనారిటీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నా.. పాక్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే భారత్ లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయంటూ మొసలి కన్నీరు కారుస్తుంటుంది.

Read Also: Pakistan Suicide Bomber: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది పోలీసులు మృతి

తాజాగా లాహోర్ యూనివర్సిటీ ప్రాంగణంలో హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులను తోటి విద్యార్థులు, యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు చితకబాదారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. పంజాబ్ యూనివర్శిటీలోని లా కాలేజ్‌లో సోమవారం దాదాపు 30 మంది హిందూ విద్యార్థులు హోలీ జరుపుకునేందుకు గుమిగూడిన సమయంలో సంఘటన జరిగింది. ఇస్లామీ జమియాత్ తుల్బా(ఐజేఏ) కార్యకర్తలు, హిందూ విద్యార్థులను బలవంతంగా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది.

ఐజేఏ కార్యకర్తలపై ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో సెక్యూరిటీ గార్డులు కూడా దాడి చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన, ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని బాధిత విద్యార్థులు తెలిపారు. అయితే దాడికి పాల్పడిన ఐజేఏ విద్యార్థి సంఘం నాయకుడు ఇబ్రహీం షాహిద్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో తమ విద్యార్థుల ప్రమేయం లేదని అన్నారు. లా కాలేజీలోని లాన్‌లలో హోలీ వేడుకలు నిర్వహించేందుకు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వలేదని పంజాబ్ యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఖుర్రం షాజాద్ తెలిపారు. ఇంట్లో వేడుకలు జరుపుకుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదని ఆయన అన్నారు.