Himanta Biswa Sarma: అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మ్యాచుకి హాజరుకావడం వల్లే భారత్ ఓడిపోయిందని, చెడుశకునం అంటూ రాహుల్ గాంధీ విమర్శించడం వివాదాస్పదమైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ కూడా కాంగ్రెస్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ జయంతి రోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం వల్లే భారత్ ఓడిపోయిందని విమర్శించారు. గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యుల పుట్టినరోజున భవిష్యత్తులో ఎలాంటి మ్యాచుల్ని నిర్వహించొద్దని బీసీసీఐని కోరుతున్నట్లు హిమంత చెప్పారు. నవంబర్ 19 ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆసీస్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఓడిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు.
‘‘ఆ రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. మనం ప్రతీ మ్యాచ్‌ని గెలుస్తూనే ఉన్నాం. ఫైనల్లో ఓడిపోయాం. అప్పుడు తెలిసింది, మనం ఎందుకు ఓడిపోయామనే విషయం. మనం హిందువులం ఏ రోజు ఎలా ఉందో చూసుకుంటాం. ఆ రోజున ఇందిరాగాంధీ జయంతి, అదే రోజున ఫైనల్ మ్యాచ్ జరిగింది’’ అంటూ హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో హిమంత బిశ్వ సర్మ అన్నారు.