NTV Telugu Site icon

Himanta Biswa Sarma: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాదే”.. బలమైన నాయకుడు లేకుండా ప్రతీ నగరంలో ఓ అఫ్తాబ్

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma comments on shraddha walkar case: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శ్రద్ధా వాకర్ హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమంత బిశ్వ శర్మ శ్రద్ధా హత్యను ప్రస్తావించారు. కచ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. దేశంలో బలమైన నాయకుడు లేకుంటే అఫ్తాబ్ వంటి వారు ప్రతీ నగరంలో పుడతారని.. మన సమాజాన్ని రక్షించుకోలేమని అన్నారు. దేశంలో మూడోసారి బీజేపీకే అధికారం ఇవ్వాల్సిన అవసరాన్ని చెప్పుకొచ్చారు. శ్రద్ధా హత్యను లవ్ జీహాద్ గా అభివర్ణించారు. హిందూ మహిళలను, ముస్లిం యువకులు ప్రలోభపెట్టి మతం మారుస్తున్నారనే లవ్ జీహాద్ కుట్రదాగి ఉందనే సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

Read Also: Shraddha Case: ఇదే పని హిందువులు చేసుంటే..? స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలు

అఫ్తాబ్ ముంబై నుంచి శ్రద్ధాని తీసుకొచ్చి లవ్ జిహాద్ పేరుతో 35 ముక్కలుగా నరికి, మృతదేహాన్ని ఫ్రిజ్ లో దాచి ఉంచి మరో మహిళను తీసుకునివచ్చారని.. ఇంటికి తీసుకెళ్లి మరో మహిళతో డేటింగ్ ప్రారంభించారని అన్నారు. దేశాన్ని తమ తల్లిగా భావించే శక్తివంతమపైన నాయకుడు లేకపోతే ప్రతీ నగరంలోనూ అఫ్తాబ్ వంటి వారు పుడతారని అన్నారు. 2024లో మూడోసారి నరేంద్రమోదీకి మళ్లీ ప్రధానిని చేయాలని ఆయన అన్నారు.

కాల్ సెంటర్ ఉద్యోగి అయిన శ్రద్ధా వాకర్ 2019 నుంచి అఫ్తాబ్ అనే వ్యక్తితో డేటింగ్ లో ఉంది. అయితే వీరిద్దరి సంబంధాన్ని తండ్రి అంగీకరించకపోవడంతో ఢిల్లీకి వెళ్లారు. తల్లిదండ్రులతో పూర్తిగా సంబంధాలను తెంచుకుంది. అయితే ఈ క్రమంలో వివాహం చేసుకోవాలని కోరినందుకు శ్రద్ధాను అత్యంత క్రూరంగా గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, 18 రోజుల పాటు ప్రతీ రోజూ రాత్రి సమయంలో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో శరీర భాగాలను పారేస్తూ వచ్చాడు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం సాక్ష్యాలను వెతికే పనిలో ఉన్నారు. ఇప్పటికీ శ్రద్ధ ఎముకలను, రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పోలీస్ కస్టడీలో ఉన్న అఫ్తాబ్ కు ఐదురోజుల్లో నార్కో ఎనాలసిస్ పరీక్ష నిర్వహించనున్నారు.