Karnataka government on the Heijab: కర్ణాటక రాష్ట్రంలో చెలరేగిన హిజాబ్ వివాదాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది. మంగళవారం జరిగిన విచారణలో కర్ణాటక ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. హిజాబ్ అల్లర్ల వెనక పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ఉందని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. హిజాబ్ అల్లర్ల వెనక పీఎఫ్ఐ కుట్ర ఉందని తెలిపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి.. హిజాబ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఈ సంస్థ ప్రారంభించిందని కర్ణాటక ప్రభుత్వం తరుపున సోలిసిటర్ జనరల్ తుషార్ మోహతా తన వాదనల్ని వినిపించారు. బుధవారం మరోసారి ఈ అంశంపై విచారణలు జరపనుంది సుప్రీంకోర్టు.
Read Also: Rahul Gandhi: అధ్యక్ష ఎన్నిక వద్దు.. జోడో యాత్రే ముద్దు..!
పీఎఫ్ఐ సంస్థ హిజాబ్ ధరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పీఎఫ్ఐ ప్రచారాన్ని చేసిందని.. ఈ వివాదం అప్పటికప్పుడు ఏర్పడింది కాదని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీని వెనక కుట్ర ఉందని తుషార్ మోహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆ సంస్థ ఇచ్చిన ఆదేశాల మేరకే విద్యార్థినులు హిజాబ్ ధరించి విద్యా సంస్థలకు వచ్చారని.. అంతకు ముందు ఏడాది ఏ స్టూడెంట్ కూడా హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరుకాలేదని ఆయన తెలిపారు. హిజాబ్ ను వ్యతిరేకించడం ఏ మతానికి వ్యతిరేకం కాదని.. సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే మతపరమైన దుస్తుల్ని వ్యతిరేకించి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని ఆయన అత్యున్నత కోర్టుకు తెలిపారు. హిజాబ్ అల్లర్లు జరుగుతున్న సమయంలో కొంత మంది కాషాయ కండువాలను కప్పుకుని వచ్చారని.. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని ఆయన సుప్రీంకు తెలిపారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఇస్లాంలో హిజాబ్ అనేది తప్పనిసరి ఆచారం కాదని.. పాఠశాలల్లో హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకించింది. ఈ విషయంపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.