Allahabad High Court: పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ ముస్లిం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తరగతి గదిలో హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి మతపరమైన ఆచారం అని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఆగస్టు 21న జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ ఇందర్‌జీత్ శుక్లాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. మహిళలు తలపై స్కార్ఫ్ ధరించడం ఇస్లాం మతంలో అత్యవసరమైన ఆచారం కాదని గతంలో పలు హైకోర్టులు అభిప్రాయపడిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.
కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రస్తావన
కర్ణాటక హైకోర్టు విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఆంక్షలను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పుకు ప్రస్తుతం కూడా ప్రాధాన్యత ఉందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో గతంలో భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువడిందని, తుది నిర్ణయం ఇంకా రాలేదని తెలిపింది. అందువల్ల కర్ణాటక హైకోర్టు తీర్పు తమకు ముఖ్యమైన మార్గదర్శకంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. హిజాబ్ ధరించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద రక్షణ పొందే అత్యవసర మతపరమైన ఆచారం అని విద్యార్థిని చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. హిజాబ్ ధరించడం తప్పనిసరి అని నిరూపించేందుకు తగిన మతపరమైన ఆధారాలు లేదా ప్రామాణిక గ్రంథాలను పిటిషనర్ సమర్పించలేదని కోర్టు పేర్కొంది.
పాఠశాల డ్రెస్ కోడ్‌పై కోర్టు వ్యాఖ్యలు
పాఠశాల యూనిఫామ్ నిబంధనలు సమానంగా, వివక్ష లేకుండా, నిజాయితీగా అమలు చేస్తూ సంస్థలో క్రమశిక్షణ, గుర్తింపును కాపాడేందుకు ఉద్దేశించినవిగా ఉంటే, డ్రెస్ కోడ్‌ను నిర్ణయించే అధికారం ప్రధానంగా పాఠశాల యాజమాన్యానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని అత్తర్సుయా ప్రాంతంలోని టాగోర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని దాఖలు చేసింది. తాను ఆరో తరగతి నుంచి హిజాబ్ ధరిస్తున్నానని, 11వ తరగతిలో ప్రవేశం సమయంలో పాఠశాల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆమె పేర్కొంది. అయితే గతంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా హిజాబ్ ధరించేందుకు అనుమతించినంత మాత్రాన అదే విధానాన్ని కొనసాగించాలని పాఠశాలపై చట్టపరమైన బాధ్యత ఏర్పడదని కోర్టు స్పష్టం చేసింది. గతంలో హిజాబ్ ధరించినందుకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం వల్ల యూనిఫామ్ నిబంధనలను మార్చాలని లేదా సడలించాలని కోరే హక్కు ఏర్పడదని పేర్కొంటూ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసింది..

