Site icon NTV Telugu

Hardeep Singh Nijjar: నిజ్జర్ హత్య దర్యాప్తును దెబ్బతీశారు.. కేసు తారుమారు చేస్తున్నారు.. భారత దౌత్యవేత్త సంచలన వ్యాఖ్యలు

Hardeep Singh Nijjar

Hardeep Singh Nijjar

Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడా దేశాల మధ్య ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది. తాజాగా కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.

అయితే, నిజ్జర్ హత్యపై కెనడాకు చెందిన ఓ ఉన్నతాధికారి బహిరంగ ప్రకటన చేయడంతో దర్యాప్తు దెబ్బతిందని సంజయ్ కుమార్ వర్మ శనివారం గ్లోబ్ అండ్ మెయిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిజ్జర్ హత్యలో కెనడా పోలీసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆ దేశ అత్యున్నత స్థాయి అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారని ఆయన అన్నారు. ఈ కేసులో భారత్ సహకరించడానికి అవసరమైన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు సమర్పించలేదని, ఆధారాలు ఎక్కడ ఉన్నాయి..? అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారు. ఈ హత్యలో భారత ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారి నుంచి సూచనలు జారీ అయ్యాయని సంజయ్ కుమార్ వర్మ అన్నారు.

Read Also: Baba Vanga: ఉగ్రదాడులు, పుతిన్ హత్య.. భయపెడుతున్న “బాబా వంగా” 2024 జోస్యం..

కెనడా పౌరుడిగా ఉన్న నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ ప్రమేయం ఉందని సాక్ష్యాత్తు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ప్రకటించిడం ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలను దెబ్బతీశాయి. ఇదే కాకుండా సీనియర్ భారత దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించింది. ఇదిలా ఉంటే కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. కెనడా అసంబంద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోంది, ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా చర్యలకు ధీటుగా భారత్ లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇంతే కాకుండా రెండు దేశాల మధ్య దౌత్యవేత్తలు సమానంగా ఉండాలని చెబుతూ.. భారత్ లో ఎక్కువగా ఉన్న 41 మంది దౌత్యవేత్తలను దేశం వదిలి వెళ్లాలని చెప్పింది.

అయితే కెనడా అధికారులు ఆరోపించిన విధంగా భారత ప్రమేయంపై ఖచ్చితమైన ఆధారాలు చూపలేదని సంజయ్ వర్మ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ, వ్యాపార సంబంధాలను విస్తరించుకోవాలని, వాణిజ్య ఒప్పందంపై చర్చలకు తిరిగి రావాలని భారత్ కోరుకుంటోందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ నెలలో కెనడా-భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కెనడా ప్రభుత్వం నిలిపేసింది.

Exit mobile version