Site icon NTV Telugu

Manipur High Court: సామూహిక ఖననంపై హైకోర్టు స్టే… కర్ఫ్యూ కొనసాగింపు

Manipur High Court

Manipur High Court

Manipur High Court: సామూహిక ఖననంపై మణిపూర్‌ హైకోర్టు స్టే విధించింది. దీంతో పరిస్థితులను అదుపులో ఉంచడం కోసం తిరిగి కర్ఫ్యను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మణిపూర్‌ ఆందోళనల్లో మృతి చెందిన కుకీ-జోమి వర్గం వారిని ఖననం చేసేందుకు నిర్దేశించిన ప్రాంతంలో యధాస్థితిని కొనసాగించాలని మణిపుర్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గత మూడు నెలలుగా జరుగుతున్న ఆందోళనల్లో మృతి చెందిన 35 మంది మృతదేహాలను ఖననం చేసేందుకు గురువారం కుకీ-జోమి వర్గానికి చెందిన గిరిజన నాయకుల ఫోరం (ITLF) సిద్ధమైంది. దీనిపై మణిపూర్‌ హైకోర్టు స్టే విధించింది. సామూహిక ఖననానికి నిర్దేశించిన ప్రాంతంలో యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్‌ మురళీధరన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభ్యర్థన మేరకు ఐదు రోజుల పాటు మృతదేహాల ఖననం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఐటీఎల్‌ఎఫ్‌ ప్రకటించింది.

Read also: Bhatti Vikramarka: ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలి.. చిట్‌చాట్‌లో భట్టి కీలక వ్యాఖ్యలు

‘‘తాజా పరిస్థితులపై మా వర్గం వారితో చర్చించాం. కేంద్ర హోంశాఖ అభ్యర్థన మేరకు మృతదేహాల ఖననాన్ని ఐదు రోజులు వాయిదా వేయాలని నిర్ణయించాం. మృతదేహాలను ఖననం చేసేందుకు మేం ఎంచుకున్న స్థలాన్ని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. మిజోరం సీఎం సైతం ఇదే విషయంపై మమ్మల్ని అభ్యర్థించారు. ఈ విషయమై ఐదు డిమాండ్‌లను ప్రభుత్వం ముందు ఉంచాం’’ అని ఐటీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అంతకుముందు చురాచంద్‌పుర్ జిల్లా హవోలై ఖోపి ప్రాంతంలో గత మూడు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లలో మరణించిన కుకీ-జోమి వర్గానికి చెందిన 35 మందిని సామూహిక ఖననం చేయనున్నట్లు ఐటీఎల్‌ఎఫ్‌ ప్రకటించింది. దీంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు హవోలై ఖోపికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం చురాచంద్‌పుర్, బిష్ణుపుర్‌ జిల్లాల్లో అదనపు బలగాలను మోహరించింది. బిష్ణుపుర్‌ జిల్లాలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి సామూహిక ఖననం చేసే ప్రాంతానికి చేరుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ ప్రాంతంలో కర్ఫ్యూను తిరిగి అమలు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Exit mobile version