NTV Telugu Site icon

Sambhal Jama Masjid: రంజాన్‌కి ముందు సంభాల్ మసీదుపై హైకోర్టు కీలక ఆదేశాలు..

Jama Masjid Sambhal

Jama Masjid Sambhal

Sambhal Jama Masjid: రంజాన్ పండగకు ముందు అలహాబాద్ హైకోర్టు సంభాల్ జామా మసీదు విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జామా మసీదు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ శుక్రవారం ఉత్తర్వుల్లో ఆదేశించారు. అయితే, మసీదును తెల్లగా మార్చేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. రంజాన్ పండగ సందర్భంగా మసీదును తెల్లగా తుడిచి శుభ్రం చేయాలని అనుమతి కోరుతూ జామా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ.. శుభ్రం చేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది.

ఏఎస్ఐ వెంటనే మసీదు స్థలాన్ని పరిశీలించి, శుక్రవారం ఉదయం 10 గంటలలోపు దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని గురువారం కోర్టు ఆదేశిస్తూ, ముగ్గురు అధికారుల బృందాన్ని నియమించాలని ఆదేశించింది. ఏఎస్ఐ నివేదిక ప్రకారం.. మసీదు లోపల భాగం సిరామిక్ పెయింట్ ఉందని, ప్రస్తుతం దానికి తెల్లగా పూత అద్దాల్సిన అవసరం లేదని చెప్పింది.

Read Also: MLC Kavitha : రెండో దఫా కులగణనలో లోపాలు – బీసీల హక్కులకు ముప్పు

శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా, మసీదు కమిటీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్ ఎఫ్ ఎ నఖ్వీ, వైట్‌వాషింగ్, లైటింగ్ పనులు మాత్రమే చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. దీనిపై కోర్టు, మసీదు ఆవరణలో దుమ్ము శుభ్రం చేయడంతో పాటు గడ్డిని తొలగించాలని కోర్టు ఏఎస్ఐని కోరింది. శుభ్రపరిచే సమయంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తవని నఖ్వీ కోర్టుకు హామీ ఇచ్చారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శాంతిభద్రలను కాపాడుతామని కోర్టుకు చెప్పారు.

గత ఏడాది నవంబర్‌లో సంభాల్‌లో జామా మసీదు వివాదాలకు కేంద్రంగా మారింది. మొఘలులు కాలం నాటి ఈ మసీదుని, ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చి దానిపై కట్టారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు సర్వేకి ఆదేశించింది. సర్వేకి వెళ్లిన అధికారులపై స్థానిక ముస్లిం మూక రాళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు వ్యక్తులు మరణించగా, పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ దాడుల్లో పాల్గొన్న వారికి కొందరికి పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ ఘటనను యోగి సర్కార్ సీరియస్‌గా తీసుకుని విచారణ జరుపుతోంది.