NTV Telugu Site icon

Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. నీటమునిగిన నివాసాలు

Gujaratsrains

Gujaratsrains

గుజరాత్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో కుండపోత వర్షం కురవడంతో పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లులు కొట్టుకుపోయాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన సహాయ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌.. అధికారులతో సమీక్ష నిర్వక్షించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వరదలో క్రికెటర్ జడేజా భార్య..
ఇక బీజేపీకి చెందిన జామ్‌నగర్ నార్త్ ఎమ్మెల్యే, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్‌లోని వరద ప్రభావిత ప్రాంతంలో నడుము లోతు నీటిలో నిలబడి సహాయ చర్యలను పర్యవేక్షించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా వరద ప్రాంతంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఆమె సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. వడోదరలో వరదల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.

ఖర్గే.. రాహుల్ డిమాండ్..
గుజరాత్‌లో రెండ్రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8,500 మందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. వరద పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని ఆరా..
ప్రధాని మోడీ… గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి వర్షాలు, వరదలపై ఆరా తీశారు. సహాయక మరియు సహాయక చర్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎక్స్ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రజల రక్షణ గురించి.. పశువుల సంరక్షణ గురించి వాకబు చేశారని పేర్కొన్నారు. గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. నిరంతరం గుజరాత్ గురించి మోడీ పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఐఎండీ రెడ్ అలర్ట్
ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.