Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బ్లాస్ట్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, ఈ ‘‘వైట్ కాలర్’’ మాడ్యుల్‌తో సంబంధం ఉన్న మరో మహిళా వైద్యురాలిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ బృందాలు అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలోని ఒక హాస్టల్ పై దాడులు చేశారు. ఈ దాడుల్లో హర్యానా రోహ్‌తక్‌కు చెందిన మహిళా డాక్టర్ ప్రియాంకా శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఆమె అనంత్‌నాగ్ జీఎంసీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: IND vs SA 1st Test: 15 ఏళ్ల తర్వాత.. కోల్ కతా టెస్ట్ లో దక్షిణాఫ్రికా విజయం..
దాడుల్లో ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఉగ్రవాద మాడ్యూల్‌కు లాజిస్టిక్, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీఎంసీ అనంత్‌నాగ్ మాజీ ఉద్యోగి అదీల్ ను అరెస్ట్ చేసిన తర్వాత, ప్రియాంకాశర్మ పేరు బయటకు వచ్చింది. ఈ కేసులో దాదాపుగా 200 మంది కాశ్మీర్ వైద్యులపై ఎన్ఐఏతో పాటు ఇతర ఏజెన్సీలు నిఘా పెట్టాయి. కాన్పూర్, లక్నో, మీరట్, సహరాన్‌పూర్, ఇతర ప్రాంతాల్లో కాశ్మీరీ విద్యార్థులు చదువుతున్న కాలేజీలు, యూనివర్సిటీలు, సంస్థలను ఎన్ఐఏ నిశితంగా పరిశీలిస్తోంది.
గత సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు పదార్థాలతో డాక్టర్ ఉమర్ అనే వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు ముందే ఇలాంటి దాడులకు కుట్ర పన్నుతున్న వైద్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరికి హర్యానా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయి. మరోవైపు, వర్సిటీతో సంబంధం ఉన్న డాక్టర్లను నుహ్, ధౌజ్ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.