NTV Telugu Site icon

Haryana Opinion Poll: హర్యానా అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలుపు..

Haryana

Haryana

Haryana Opinion Poll: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గెలుపు ప్రస్తుతం బీజేపీ, ఇండియా కూటమికి చాలా కీలకంగా మారబోతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సొంత మెజారిటీతో అధికారంలోకి రాలేకపోయిన బీజేపీ, ఈ మూడు రాష్ట్రాల్లో గెలిచి తమ పాలనకు తిరుగు లేదని నిరూపించుకోవాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రానీవకుండా అస్త్రశస్త్రాలను ఒడ్డుతోంది. ప్రస్తుతం హర్యానాలో బీజేపీ అధికారంలో ఉండగా, మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పాలిస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా హర్యానా ఎన్నికలపై పీపుల్స్ పల్స్ ఒపీనియన్ పోల్ విడుదలైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. అయితే, స్వల్ప తేడాతో కాంగ్రెస్ అధికారం జేజిక్కించుకుంటుందని సర్వే అంచనా వేసింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీకి 34-39 స్థానాలు, కాంగ్రెస్‌కి 43-48 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు 46 సీట్లు అవసరం.

Read Also: MP Shocker: పోర్న్‌ని చూసి దారుణం.. 9 సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..

ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మరియు జననాయక్ జనతా పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ , ఆప్‌లు 3-8 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. 2019 హర్యానా ఎన్నికల్లో బీజేపీకి 40, కాంగ్రెస్‌కి 31, జేజేపీకి 10, ఐఎన్ఎల్డీ ఒక స్థానంలో విజయం సాధించాయి. బీజేపీ-జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఇటీవల వీరిద్దరి మధ్య పొత్తు కూలిపోయింది.

పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్‌కి 44 శాతం, బీజేపీకి 41 శాతం ఓట్లు వస్తాయని అంచానా వేసింది. 2019లో 28 శాతం ఓట్లు కాంగ్రెస్‌కి రాగా, ఈ సారి దాని ఓట్ షేర్ 44 శాతానికి చేరుకుంటుందని, అలాగే బీజేపీకి 2019లో 36 శాతం రాగా, ఈ సారి 41 శాతానికి చేరుకుంటుందని అంచనా. జాట్‌లు, దళితులు కాంగ్రెస్‌కి మద్దతుగా నిలుస్తున్నారని సర్వే తెలిపింది. ఓబీసీలలో బీజేపీకి మద్దతు తగ్గిపోయిందని, ఓబీసీని సీఎంగా నియమించాలన్న వ్యూహం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని సర్వే సూచిస్తోంది. వ్యవసాయం, అగ్నివీర్ పథకం, నిరుద్యోగం ఎన్నికలపై ప్రభావం చూపించే అంశాలుగా మారాయి. అయితే, ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఆలోగా బీజేపీ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటే మళ్లీ అధికారం చేపట్టవచ్చని అభిప్రాయపడింది.