NTV Telugu Site icon

Haryana elections: ఓటమి తర్వాత బాలికలకు ఫ్రీ బస్ సర్వీస్‌ని నిలిపేసిన ఎక్స్-ఎమ్మెల్యే..

Balraj

Balraj

Haryana elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ చేతిలో అనూహ్యమైన ఓటమితో కాంగ్రెస్ హైకమాండ్, కార్యకర్తలు ఢీలా పడ్డారు. చాలా చోట్ల తాము గెలుస్తామని అనుకున్నప్పటికీ ఓటమి మరోసారి పలకరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, 37 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది.

హర్యానాలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తులకు సేవ చేస్తారనే మంచి పేరు ఉన్నప్పటికీ వారు కూడా ఓడిపోయారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్‌తక్ లోని మెహమ్ నియోజవర్గం నుంచి పోటీ చేసిన ఓడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బాలరాజ్ కుందూ జిల్లాలో విద్యార్థినుల కోసం తాను అందిస్తున్న ఉచిత బస్సు సర్వీసుని నిలిపేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. హర్యానా జనసేవక్ పార్టీ(హెచ్‌జేపీ) నాయకుడు కుందూ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎన్నికైన బలరామ్ డాంగి ఈ బాధ్యత తీసుకుని బాలికలకు ఉచిత బస్సు సౌకర్యం అందించాలని కోరారు. ప్రజలు తాను చేస్తున్న సేవకు ప్రతిఫలం ఇవ్వలేదని తన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తాను ఉచిత బస్సు సర్వీసుని ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.

Read Also: Delhi: ఢిల్లీలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరికొత్త వ్యూహం.. ఆ రూట్లలో వెళ్తే బాదుడే!

కుందూ 2017లో 8 వాహనాలతో ఈ సేవని ప్రారంభించారు. క్రమంగా 18 బస్సులకు విస్తరించారు. ఇవి మెహమ్‌లోని వివిధ గ్రామాల నుంచి విద్యాసంస్థల వరకు మహిళా విద్యార్థులను తీసుకెళ్తాయి. ఈ సేవల గురించి ఒక విద్యార్థిని మాట్లాడుతూ.. ఈ బస్సులు 47 గ్రామాల నుంచి తమను పాఠశాలలు, కళాశాలకు తీసుకెళ్తాయని, తమ కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాయని, బాలికలు సురక్షితంగా చేరుకునేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు.

ఇంత సేవల చేసినప్పటికీ ప్రజలు తనను ఆదరించలేకపోవడంపై కుందూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమి, ఓటర్ల స్పందన తీవ్రంగా బాధించాయని తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. ఈ స్థానం నుంచి గెలిచిన కాంగ్రస్ అభ్యర్థి బలరాం డాంగి బస్సు సర్వీసుని నిలిపేయకుండా చూస్తానని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం తాను సేవని మొదలుపెట్టలేదని చెబుతున్న కందూ ఈ సేవల్ని ఇప్పుడు ఎందుకు ఆపాలి..? అని డాంగీ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం డాంగి56,865 ఓట్లతో సమీప ప్రత్యర్థి కుందుపై 18,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.