Site icon NTV Telugu

Diwali Gift: బాస్ అంటే నువ్వే.. ఉద్యోగులకు దీపావళి గిఫ్టులుగా కార్లు.. ఆఫీస్ బాయ్‌కి కూడా..

Haryana

Haryana

Diwali Gift: ఉద్యోగి అంటే యజమాని కింద బానిస అనేలానే వ్యవహరిస్తుంటాయి చాలా కంపెనీలు. తమ ఉద్యోగుల పరిస్థితిని లెక్క చేయవు, కంపెనీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఉద్యోగులపై పెద్దగా పట్టించుకోని కంపెనీలు కోకొల్లలు. కానీ కొన్ని కంపెనీల బాస్‌లు మాత్రం ఉద్యోగుల్ని సొంత మనుషులుగా చూసుకుంటారు. వారి సంక్షేమానికి డబ్బులు కేటాయిస్తుంటారు. ఇలాంటి కోవకే చెందుతుంది హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ. కంపెనీ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగుల్ని గుర్తించారు యజమాని. వారిని సర్‌ప్రైజ్ చేసేలా ఏకంగా కార్లనే గిఫ్టుగా ఇచ్చారు.

Read Also: AFG vs NED: ఆఫ్ఘాన్ అద్భుత ఫీల్డింగ్.. 179 పరుగులకే నెదర్లాండ్ ఆలౌట్

హర్యానాలోని ఓ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ గిఫ్టులను అందించింది. దీపావళి కానుకగా కార్లను ఇచ్చింది. పంచకులలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులను సెలబ్రిటీలుగా పేర్కొంటూ.. 12 మంది స్టార్ పెర్ఫార్మర్స్‌కి కార్లను బహూకరించాడు.

ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్ హెల్త్ కేర్, సమీప భవిష్యత్తులో మరో 38 మంది ఉద్యోగులకు కార్లను అందించాలని యోచిస్తోంది. ఈ దీపావళి బహుమతి అందుకున్న వారిలో ఆఫీస్ బాయ్ కూడా ఉన్నారు. తన కంపెనీ విజయానికి ఉద్యోగుల కఠిన శ్రమ, అంకితభావం, విధేయత కారణమని పేర్కొన్నారు. వీరిలో కొందరు కంపెనీ ప్రారంభం నుంచి ఆయన వెంటే ఉన్నారు. ఈ కార్లు కేవలం దీపావళి కానుకలే కాదని, కంపెనీపై వారికి ఉన్న అచంచలమైన నిబద్ధత, విశ్వాసానికి రివార్డులని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గిఫ్టుగా కారు అందుకున్న వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా రాదట. ఇలాంటి గిఫ్టులను తాము కలలో కూడా ఊహించలేదని ఉద్యోగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Exit mobile version