TMC Crisis: మమతకు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన ‘‘రైట్ హ్యాండ్’’

  • టీఎంసీ కీలక నేత చంద్రమా భట్టాచార్య రాజీనామా.
  • మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా చంద్రమాకు గుర్తింపు.
  • టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరింత తీవ్రం.
Tmc Crisis

Tmc Crisis

TMC Crisis: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం తీవ్రమైంది. మమతా బెనర్జీకి వరసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆమెను ధిక్కరించి తిరుగుబాటు వర్గంగా మారారు. ఇప్పుడు మమతా వెంట కొంత మంది నేతలు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ పార్టీకి ‘‘రైట్ హ్యాండ్’’గా పరిగణించబడే చంద్రమా భట్టాచార్య పార్టీలోని అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. చంద్రమా నిష్క్రమణను టీఎంసీకి అతిపెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు.

టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న చంద్రమా భట్టాచార్య తన నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఒక లేఖలో తెలియజేసినట్లు సమాచారం. సంస్థాగత పదవుల నుంచే కాకుండా, పార్టీకి చెందిన అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చంద్రమా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. టీఎంసీలో ఉన్న ప్రధాన నేతల్లో ఒకరు. పార్టీలో, ప్రభుత్వంలో ఆమెకు గట్టి పట్టు ఉండేది. ప్రస్తుతం, ఈమె కూడా రాజీనామా చేయడంతో టీఎంసీ సంక్షోభం మరింత తీవ్రమైంది.