Site icon NTV Telugu

Israeli Airstrike: ఇది ఇజ్రాయిల్ అంటే.. అక్టోబర్ 7 దాడుల హమాస్ కమాండర్ హతం..

Hamas

Hamas

Israeli Airstrike: అక్టోబర్ 07, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ భీకర ఉగ్రదాడి చేసింది. 1200 మందిని క్రూరంగా హతమార్చింది. చాలా మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాలోని హమాస్‌పై, లెబనాన్‌లోని హిజ్బుల్లాపై దాడులు చేసి, ఈ రెండు ఉగ్రవాద సంస్థల్ని నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇప్పటికే హమాస్‌కు చెందిన టాప్ లీడర్లు ఇస్మాయిల్ హానియే, యాహ్యా సిన్వార్‌లను హతమార్చింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను వెతికి వేటాడి చంపేసింది.

Read Also: Startup Journey: సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి… దోశల వ్యాపారంలోకి వచ్చిన యువకుడు

తాజాగా, అక్టోబర్ 07 నాటి మారణహోమానికి సూత్రధారుల్లో ఒకరుగా ఉన్న సీనియర్ హమాస్ సైనిక కమాండర్‌ను శనివారం ఎయిర్ స్ట్రైక్స్‌లో ఇజ్రాయిల్ చంపేసింది. హమాస్ సైనిక విభాగం, కస్సామ్ బ్రిగేడ్స్‌లో సీనియర్ సభ్యుడుగా ఉన్న రాద్ సాద్‌‌ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) హతమర్చాయి. ఇతను హమాస్‌కు ఆయుధాలు సమీకరించుకునేందుకు, తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. హమాస్ ప్రస్తుత సైనిక అధిపతి ఇజ్ అల్-దిన్ హద్దాద్‌కు డిప్యూటీగా అతను పరిగణించబడ్డాడని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

దాడికి సంబంధించిన దాడి వీడియోను ఇజ్రాయిల్ విడుదల చేసింది. ఒక వాహనం పేలిపోతున్నట్లు ఇందులో కనిపించింది. రషీద్ కోస్టల్ రోడ్‌లో కారులో పారిపోతున్న సమయంలో సాద్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో సాద్‌తో కలిసి ముగ్గురు మరణించినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. గాజాలో ఇప్పటికీ పనిచేస్తున్న హమాస్ కమాండర్లలో సాద్ కూడా ఒకరుగా ఐడీఎఫ్ చెబుతోంది. ఇటీవల, ఇజ్రాయిల్ బలగాలపై దాడులు చేయడానికి సాద్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది.

Exit mobile version